జగన్ కుట్రలో పవన్, కేసిఆర్, కేటిఆర్ ల హస్తం ఉందంటారా ?

Friday, October 26th, 2018, 12:37:55 PM IST

నిన్న వైఎస్ జగన్ పై జరిగిన దాడి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు బాయుడుగారు స్పందించిన తీరు చాలా విచిత్రంగా ఉంది. ప్రసంగం ఆరంభంలోనే ఇది జగన్ ఆడుతున్న డ్రామా అని స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి ఈ దాడిని ఖండించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలంగాణ మాజీ మంత్రి కేటిఆర్, జగన్ కు ఫోన్ చేసి పరామర్శించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ లను కూడ తప్పుబట్టడం హాస్యాస్పందంగా అనిపిస్తోంది.

సహచర పార్టీ లీడర్ పై దాడి జరిగినప్పుడు అది ఎవరు చేశారనే విషయాన్ని పక్కనబెడితే ఆ దాడిని ఖండించడం, దాడికి గురైన వ్యక్తిని పరామర్శించడం నైతికం. నిన్న పవన్, కేసిఆర్, కేటిఆర్, పలువురు కేంద్ర స్థాయి నాయకులు అలా అనుకునే పరామర్శ చేశారు. ఇదే బాబుగారికి నచ్చలేదు. పైగా వాళ్లంతా పరామర్శించడం, తిత్లీ తుఫాను పై నోరు కూడ విప్పని కేసిఆర్, కేటిఆర్ లు ఇప్పుడు మాట్లాడటం చూస్తుంటే ఈ దాడిని వారంతా కలిసి ప్లాన్ చేశారని తనకు అనుమానంగా ఉందనే అర్థం వచ్చేట్టు ఆయన మాట్లాడారు.

ఇక్కడ గమనిస్తే బాబు వేలెత్తి చూపిస్తున్న పవన్, కేసిఆర్, కేటిఆర్ లలో ఎవరూ కూడ దీనికి కారణం చంద్రబాబేనని విమర్శించలేదు. ముఖ్యమంత్రే భాద్యత తీసుకోవాలని డిమాండ్ చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం అందరూ కలిసి ప్రధానితో చేతులు కలిపి తనను ఇరికించాలని చూస్తున్నట్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వార్నింగ్స్ ఇస్తూ మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తనపై ఆరోపణలను తిప్పి కొట్టడం ఆమోదించదగినదే అయినా ఇలా అకారణంగా పరామర్శించిన వాళ్ళపై కూడ అనుమానాలు వ్యక్తంచేస్తూ మాట్లాడటం సమంజసమనిపించుకోదు.

  •  
  •  
  •  
  •  

Comments