సకల సౌకర్యాలతో చేసేది దీక్షవుతుందా తెలుగు తమ్ముళ్లు !

Tuesday, October 30th, 2018, 01:03:42 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై నిరసన తెలుపుతున్నారు అంటే అది ఖచ్చితంగా నామమాత్రపు నిరసనేనని ఆ నిరసన జరిగిన తీరే చెప్పేస్తుంది. అసలు పోరాటం అంటే మన భాధ, అవసరం, ఆశయం ఏమిటో స్పష్టంగా తెలిసిపోవాలి. కానీ బాబుగారు, టీడీపీ ముఖ్య నేతలు దీక్ష చేస్తే అదేదో ఒక వేడుకలా ఉంటుంది తప్ప పోరాటంలా అనిపించదు. ప్రస్తుత విషయానికొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు కడపలోని ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. కేంద్రం రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసన తెలపడం, మోడీ కక్ష సాధింపు చర్యలను ఎండగట్టడం, హోదా సాధన, కడప ఉక్కు పరిశ్రమ ఈ దీక్ష ప్రధాన లక్ష్యాలు. ఈ లక్ష్యాలు బాగానే ఉన్నా దీక్ష జరగబోయే తీరే ఆ లక్ష్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేలా ఉంది.

గత ఏప్రిల్ నెలలో కూడ హోదా సాధనకు, హామీల అమలు కోసం విజయవాడలో ధర్మ పోరాట దీక్ష చేశారు చంద్రబాబు. టీడీపీ శ్రేణులు ఈ దీక్షను నడిపించిన తీరును ఇప్పటికీ జనాలు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ దీక్ష సకల సౌకర్యాలతో అట్టహాసంగా జరిగింది కాబట్టి. ముందుగా సభకు వేలాది మందిని తరలించడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సుల్ని వాడిన దీక్ష నిర్వాహకులు సభా వేదికపై చంద్రబాబు కోసం పట్టు పాన్పులాంటి పీఠాన్ని ఏర్పాటుచేశారు. అంతేకాదు బాబుకు కొంచెం కూడ అసౌకర్యం కలగకుండా చుట్టూ పదుల సంఖ్యలో ఎయిర్ కండీషనర్లు బిగించారు. పార్టీ ముఖ్యులందరికీ సకల వంటకాలతో భోజనాలు పెట్టారు.

అంతేనా దీక్షలో నేతలు లైన్లో వచ్చి బాబుకు మొక్కుతూ వెళ్లడం, నాయకులందరూ ఆసాంతం బాబును పొగడటం, అన్ని మతాల పెద్దలు వచ్చి పూజలు, ప్రార్ధనలు చేయడం జరిగాయి. దీంతో కంఫర్టబుల్ దీక్ష కేంద్రాన్ని ఎలా అన్ కంఫర్ట్ చేస్తుందని జనాలకే అనుమానం వచ్చింది. కాగా ఈరోజు చేపట్టబోతున్న దీక్షకు జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.

జగన్ సొంత జిల్లాలో దీక్ష జరుగుతుండటంతో నేతలు సీఎం రమేష్, కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలు గొప్ప ఏర్పాట్లు చేస్తున్నారట. 96 ఎకరాల సభా స్థలికి లక్షమంది జనం వచ్చేందుకు 1500 ఆర్టీసీ బస్సులను వాడుతున్నారు. వేదికను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక భోజనాలు సరేసరి. మొత్తం మీద ఒక పోరాటంలా జరగాల్సిన దీక్షను అన్ని హంగులతో పండుగలా జరపనున్నారని తెలుస్తోంది. ఇంతా చేసి బాబుగారు అక్కడ ఉండేది రెండున్నర గంటలు మాత్రమే. మరి చూడాలి కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ఈ సంబరాలు దీక్ష కేంద్రానికి కనీసం గిలిగింతలైనా పెడుతుందో లేదో.

  •  
  •  
  •  
  •  

Comments