టీడీపీ ఓటమి పాలైతే.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా?

Monday, April 22nd, 2019, 09:57:55 AM IST

ఏపీలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాల‌ని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు తెలివిగా ఎన్నిక‌ల‌కు ముందుగానే కోడ్‌ను గుర్తు పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను బుట్ట‌లో వేసుకునేందుకు అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ముఖ్యంగా త‌న‌కు వ్య‌తిరేకంగా హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ దూకుడును క‌ట్ట‌డి చేసేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేశారు. మ‌రి ఇంత‌గా చంద్ర‌బాబు ఎందుకు అలా ప్ర‌య‌త్నించారు? ఎందుకు అభివృద్ది పేరుతో త‌న‌కే ఓటు వేయాల‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించుకున్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదకు వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీల మ‌ధ్య ఏ రేంజ్‌లో పోరు సాగిందో ఎన్నికలకు ముందు, త‌ర్వాత కూడా మ‌న‌కు అలానే క‌నిపించింది.

చంద్రబాబు చివరలో అభివృద్ధికి ఓటు వేయమని చెబుతూ వచ్చారు. దీని వెనుక అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి త‌క్ష‌ణ ప్ర‌యోజ‌నం త‌న‌ను న‌మ్ముకుని అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టిన త‌న సామాజిక వ‌ర్గానికి న్యాయం చేయ‌డం ప్ర‌ధాన భాగం. ఇక‌, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాల‌నే త‌న క‌ల‌సాకారం కావ‌డంతోపాటు చిన‌బాబు నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం అనే ప్ర‌ధాన క్ర‌తువు చంద్ర‌బాబుపై ఉంది. ఈ మొత్తం నేప‌థ్యంలోనే ఆయ‌న ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ పేరుతో చంద్ర‌బాబు ఎన్నిక‌లను కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ప్ర‌తి విష‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి. ఇక‌, రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల‌ను కూడా బాబు ర‌చ్చ‌రచ్చ చేశార‌ని అంటున్నా, దీని వెనుక కూడా చంద్ర‌బాబు వ్యూహం వేరేగా ఉంది. అయితే ఒకవేళ మే 23 నాటి ఫ‌లితాల్లో చంద్ర‌బాబు ఓట‌మిపాలైతే ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న పార్టీ ప‌రిస్థితి ఏంటి? దాదాపు ఐదేళ్లుగా పార్టీలో జాతీయ కార్య‌ద‌ర్శి పోస్టులో ఉన్న‌ప్ప‌టికీ, లోకేష్‌కు ప‌ట్టుమ‌ని ప‌దిమందిని డీల్ చేయ‌డం కూడా రావ‌డం లేద‌ని గ‌త మ‌హానాడు వేదిక‌గా చాలా మంది వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్పుడు అధికారంలోకి రావ‌డం ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుకు అత్యంత ప్రాముఖ్యంగా మారింది. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం వెనుక బాబు వ్యూహంలో మ‌రో ప్ర‌ధాన భాగం, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై క‌సి తీర్చుకోవ‌డ‌మే అని పైకి క‌నిపిస్తున్నా, రేపు అవ‌స‌ర‌మైతే మ‌రోసారి బీజేపీతో క‌లిసేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వ‌డం ఖాయ‌మ‌నేది మేధావుల మాట‌. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఎవ‌రూ ఉండ‌రు. అనే విష‌యాన్ని బాగా నమ్మే నాయ‌కుడు చంద్ర‌బాబు.

ఇదిలా ఉండగా నిజానికి జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు కోరుతున్న బ‌లం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కే అయితే. ప‌రిస్థితి వేరేగా ఉండేది. కానీ, చంద్ర‌బాబు వ్యూహం వేరు. త‌న‌పై ఉన్న కేసుల‌ను అణిచి ప‌ట్టేందుకు, త‌న జోలికి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను రాకుండా ఉండేందుకు ఆయ‌న జాతీయ స్థాయిలో స్నేహాలు నెరుపుతార‌ని బాబు గురించి తెలిసిన చాలా మంది రాజ‌కీయ నేత‌లు చెప్పేమాట‌. అంతేకాదు, జాతీయ స్థాయిలో త‌న గళం వినిపించాలంటే, చంద్ర‌బాబుకు ఎవ‌రైనా తోడు ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా చెబుతుంటారు. అందుకే చంద్ర‌బాబు మ‌రోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం వెనుక అనేక వ్యూహ ప్ర‌తి వ్యూహాలు ఉన్నాయ‌నే వాటిలో ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే. అందుకే ఈ విజయం చంద్రబాబుకు గట్టి సవాల్ అనే అర్ధమవుతుంది.