కొంచెం చంద్రబాబు సీనియారిటీని గుర్తించండయ్యా !

Thursday, October 11th, 2018, 05:00:26 AM IST

దేశంలో ఉన్న సీనియర్ పొలిటీషియన్స్ జాబితాలో చంద్రబాబు నాయుడుగారి పేరు కూడ ఉంటుంది. ఇదొక రకంగా బాబుగారికి గౌరవమనే చెప్పాలి. కానీ ఎవరైనా సరే తన గౌరవాన్ని తానే పదే పదే గుర్తుచేసుకుంటూ పొతే అది కాస్త డ్యామేజ్ అవుతుంది. ప్రస్తుతం బాబు విషయంలో కూడ అలానే జరుగుతోంది.

బీజేపీతో స్నేహానికి చరమగీతం పాడాక మోడీ చంద్రబాబును అవకాశం ఉన్న ప్రతి చోట లాజిక్కులు వెతికి మరీ విమర్శిస్తూనే ఉన్నారు. దీనికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు మాత్రం మోడీ కంటే రాజకీయాల్లో నేనే సీనియర్.. నాకు గౌరవం ఇవ్వండి, ఒక సీనియర్ పొలిటీషియన్ను ఇంతలా అవమానిస్తారా, దేశంలో ఉన్న సీనియర్ రాజకీయనాయకుడ్ని నేనే.. ఆ సంగతి గుర్తుంచుకోండి అంటూ ఇప్పటికి ఎన్నోసార్లు అన్నారు. కొన్నిసార్లు ప్రాధేయపడ్డట్టు కూడా కనిపించారు. తాజాగా అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా కూడ తన సీనియారిటీని గుర్తు చేశారు బాబు.

ఒకటి రెండుసార్లు ప్రస్తావించవలసిన సీనియారిటీని బాబు ఇలా మాటకు ముందొకసారి వెనుకోకసారి చెబుతూ ప్రత్యర్థులకు దీటైన సమాధానాలివ్వడం మర్చిపోతుండటం చూస్తుంటే అయ్యా చంద్రబాబుగారి సీనియారిటీని కాస్త గుర్తించాడయ్యా అని ఇతర రాజకీయ నాయకులకు చెప్పాలనిపిస్తోంది.