చిరంజీవిని తిట్టారే..మరి మీరు చేస్తున్నదేంటి బాబుగారు ?

Sunday, October 28th, 2018, 12:49:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యాన్ని స్థాపించి 2011లో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. చిరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన అభిమానులు సైతం స్వాగతించలేకపోయారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే ఓటమి తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా చిరు చేత పార్టీ పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకు పడకుండా చీల్చడంతో పాటు తమ ఓటు బ్యాంకును దెబ్బకొట్టారని, తమ ఓటమికి కారణం చిరంజీవే అన్నట్టు మాట్లాడారు. ఇప్పటికీ ఆయన్ను ఒక రాజకీయ ద్రోహిగానే చిత్రీకరిస్తున్నారు.

చివరికి తమతో దోస్తీ కట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ను సైతం అప్పుడు అన్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిసి పోయినట్టే ఇప్పుడు తమ్ముడు బీజేపీలో విలీనమైపోతాడని, అన్ననే ప్రశ్నించలేనివాడు ఇక రాష్ట్రానికి ఏం పనిచేస్తాడని ఎద్దేవా చేస్తున్నారు. ఇన్ని మాటలు మాట్లాడిన, మాట్లాడుతున్న టీడీపీ పక్క రాష్ట్రం తెలంగాణలో కేసిఆర్ ను ఓడించడానికి బద్ద శత్రువు కాంగ్రెస్ తో చేతులు కలిపేసింది. ఈ పరిణామమే ప్రజలకి అర్థంకాకుండా ఉంటే కేంద్ర స్థాయిలో కూడ కాంగ్రెస్ పంచన చేరడానికి బాబు వ్యూహాలు రచిస్తున్నారు.

ఈసారి బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడానికి, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ప్రత్యాన్మాయ కూటమి ఏర్పాటులో భాగంగా ఆయన కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మధ్యవర్తిత్వం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులుగా ఉన్న వారిని మిత్రులుగా మార్చే పనిలో పడ్డారు. అందులో భాగంగానే నిన్న ఢిల్లీలో బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో మంతనాలు జరిపి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ఆమెకు నచ్చజెప్పే యత్నం చేశారు.

బాబు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఆంధ్రలో కూడ ఆయన కాంగ్రెస్ తో జోడీ కట్టే రోజు ఎంతో దూరంలో లేదని అర్థమైపోతోంది. మరి 2011లో కాంగ్రెస్ లో చేరాడని చిరంజీవిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్ తో దోస్తీకి వెంపర్లాడుతుండటాన్ని ఏమనాలి.

  •  
  •  
  •  
  •  

Comments