ఐటీ దాడుల‌కే దిమ్మ‌తిరిగే ప్ర‌తిదాడి?

Friday, October 5th, 2018, 11:02:04 PM IST

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మైండ్ గేమ్, వ్యూహాల ముందు ఎంతటి పెద్దన్న‌లైనా త‌లొంచాల్సిందే. ఇరు రాష్ట్రాల్ని పాలిస్తున్న చంద్ర‌న్న‌లు మ‌హా మేధావులు అన్న సంగ‌తి విధిత‌మే. అయితే మేధావుల‌కు సైతం దిమ్మ‌తిరిగే ట్రీట్ ఇచ్చేందుకు మోదీ సిద్ధ‌మ‌వుతున్న తీరు చూస్తుంటే ఏపీ ఒణికిపోతోంది. కేసీఆర్ ఎలానూ మోదీ ముందు మోక‌రిల్లారు కాబ‌ట్టి, ఆయ‌నకు, ఆయ‌న కుటుంబానికి ఎలాంటి ఐటీ దాడుల భ‌యం లేదు. తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌త్య‌ర్థుల‌పై ఐటీ దాడులు షురూ చేసిన మోదీ, ఇప్పుడు ఏపీలో అధికార ప‌క్షంపైనా దాడులు ముమ్మ‌రం చేశార‌ని తెలుస్తోంది.

ఇదే విష‌య‌మై కేబినెట్ స‌మావేశానికి ముందే చంద్ర‌బాబు త‌న మంత్రుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశంలో ముచ్చ‌టించార‌ని ఏపీ- పొలిటిక‌ల్ కారిడార్‌లో ముచ్చ‌ట సాగుతోంది. ఏపీపై కేంద్ర ప్ర‌భుత్వ దాడిగా దీనిని అభివ‌ర్ణిస్తున్నారు. బాబుతో భేటీలో ఇదే విష‌యాన్ని మంత్రులంతా ముక్త‌కంఠంతో అంగీక‌రించార‌ట‌. ఏపీపై ఐటీ దాడులు చేయించ‌డం ద్వారా త‌మ ప్ర‌తిష్ఠ‌ను మంట క‌లిపేందుకు మోదీ చూస్తున్నార‌ని ప్ర‌తిదాడి చేసేందుకు చంద్ర‌బాబు & కో ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంతేకాదు వంద‌ల సంఖ్య‌లో ఐటీ అధికారులు బెజ‌వాడ‌- గుంటూరు స‌ర్కిల్లో మాటు వేసి తేదేపా మంత్రులు- కాంట్రాక్ట‌ర్లు- పారిశ్రామిక వేత్త‌లు వ‌గైరా వ‌గైరా మంది మార్భ‌లంపై ఏక‌కాలంలో దాడులు నిర్వ‌హించేందుకు సాగుతున్న ప్ర‌య‌త్నాల్ని తేదేపా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టేశాయి. ఆ క్ర‌మంలోనే ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్ని తీసుకున్నార‌ని తెలిసింది. ఇదంతా చూస్తుంటే ఏపీలో అస‌లేం జ‌రుగుతోంది? అన్న సందిగ్ధ‌త మ‌రోవైపు ప్ర‌జ‌ల్లో నెలకొంది. ఏపీలో అవినీతి జ‌రుగుతోంద‌ని సాక్షాత్తూ న‌రేంద్ర మోదీనే బాబుకు హెచ్చ‌రిక‌లు పంపించారని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. ఆ అవినీతి అంతా తేదేపా వ‌ర్గాలు చేస్తున్న‌దేన‌ని ఆయ‌న హెచ్చ‌రించార‌న్న ప్ర‌చారం సాగింది. హెచ్చ‌రించిన త‌ర్వాతే మోదీ ఇలా ఐటీ చేత దాడులు చేయిస్తున్నార‌ని ఒక వ‌ర్గం చెబుతుంటే, ఎన్నిక‌ల వేళ గెలుపు కోసం, త‌మ‌ను అణ‌చి వేయ‌డం కోసం మోదీ ఈ ఆట ఆడుతున్నార‌ని తేదేపా వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి సింప‌థీ కొట్టేయాల‌ని ద్విముఖ వ్యూహం ర‌చించార‌ట‌. అంతేకాదు మోదీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఉన్న ఆస్కారం ఏంటో చెప్పాల్సిందిగా లా సెక్ర‌ట‌రీని ఆదేశించారు. ఇక ఐటీ అధికారుల‌కు సెక్యూరిటీని కూడా ఉప‌సంహ‌రించుకుంచుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఈ గేమ్ అంతా చూస్తుంటే పెద్ద లెవ‌ల్లోనే ఏదో పొలిటిక‌ల్ గేమ్ న‌డుస్తోంద‌ని సామాన్యులకు సైతం అర్థ‌మైపోతోంది.