ఎంపీ సీట్లు గెలుపు కోసం చంద్రబాబు నాటకాలు : ఉండవల్లి

Wednesday, May 30th, 2018, 05:17:17 PM IST

రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మంచి మాటకారి అనే విషయం అందరికి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వున్నపుడు ఆయనకు మంచి అనుచరుడిగా పేరున్న ఉండవల్లి, రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టడం తగ్గించారు. కాగా ఇటీవల కేంద్ర నిధులపై టీడీపీ, బీజేపీల మాటలలోని నిజానిజాల్ని తేల్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేఎఫ్సి పేరిట ఒక నిజ నిర్ధారణ కమిటీ నియమించారు. అందులో భాగస్వామిగా వుండి, కమిటీలో తనవంతు సూచనలిచ్చారు ఉండవల్లి. అయితే తనకి ప్రస్తుత రాజకీయాలపై అంత ఆసక్తి లేదని, నిజాన్ని నిర్భయంగా చెప్పటానికి ఈ కమిటీని నియమించిన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి తాను ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నట్లు ఆ సమయంలో ఆయన తెలిపారు. ఇక నేడు అయన ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్ర చంద్రబాబుకు పదవీ కాంక్ష రోజురోజుకి పెరుగుతోందని, అందుకే మొన్నటి వరకు తాను తొక్కిపెట్టి వున్న హోదా ఉద్యమాన్ని మళ్ళి ఇప్పుడు జగన్ తిరగతోడుతుంటే భయపడ్డ బాబు మళ్లి హోదా రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి చాలా తెలివిగా నడుచుకుంటారని, మాకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 25 మంది ఎన్నికల్లో ఇస్తే హోదా తప్పక తీసుకొస్తామని కొత్త రాగం మొదలెట్టారని అన్నారు. నిజానికి అసలు ఏపీలో వుండేదే 25 ఎంపీ సీట్లని, మొత్తం సీట్లను టీడీపీ గెలిచినప్పటికీ కేంద్రంలో ఏవిధంగా చక్రం తిప్పి హోదా తేగలరో వివరంగా చంద్రబాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమని, మొత్తం ఎంపీ సీట్లను గెలవడం కోసమే చంద్రబాబు ఈ కుటిల పన్నాగం పన్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు వైసీపి అధినేత జగన్ కు, జనసేన అధినేత పవన్ కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేని టిడిపి నాయకులు వారిపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని, నిజానికి ప్రజల్లో టీపీడీ ప్రాభవం పూర్తిగా తగ్గిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. ఏపీ విభజన దుర్మార్గ రీతిలో జరిగిందని, పార్లమెంట్ తలుపులను మూసేసి మరీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని, అదే సమయంలో పార్లమెంట్ లో లైవ్ టెలికాస్ట్ జరిగివుంటే మనకు జరిగిన అన్యాయం ప్రజలకు కళ్ళకు కట్టినట్లు కనిపించేదని ఆవేదన వ్యక్తం చేసారు.

అయినా ఇదే చంద్రబాబు అప్పట్లో హోదా కోసం ఒప్పుకుని, తరువాత హోదా అనవసరమని, ప్రత్యక ప్యాకెజీకి మొగ్గుచూపిన విషయాన్నీ గుర్తు చేశారు. కేంద్రం ఏపీకి మంజూరు చేసిన నిధులవిషయమై చంద్రబాబు ఎందుకు లెక్కలు చెప్పలేకపోతున్నారు. ఆ నిధుల లెక్కలు అడిగే హక్కు ప్రతి ఏపీ పౌరుడికి ఉంటుందని అన్నారు. కర్ణాటకలో ఇటీవల కుమారస్వామీ ప్రభుత్వ బలనిరూపణ పరీక్షను అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా లైవ్ ద్వారా చూసారని, సుప్రీమ్ కోర్ట్ న్యాయంగా వ్యవహరించడం వల్లనే అక్కడ అది సాధ్యమైందని చెప్పారు. అలానే టిటిడి మాజీ అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై టీపీడీ ప్రభుత్వం విచారణ జరపాలని, అలా చేయడం వల్ల నిజానిజాలు బయటకు వస్తాయని, దోషులు బయటకు వస్తారని అన్నారు. ఇదే చంద్రబాబు 2008లో టిటిడి కార్యకలాపాలపై సిబిఐ విచారణ జరపాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉండగా కోరారని, మరి మీరు ఇప్పుడు అధికారంలో వున్నపుడు విచారణ చేపట్టడానికి భయమేంటని ఉండవల్లి ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీ ప్రజలు చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదని, రానున్న ఎన్నికలు ఆయనకు మంచి కనువిప్పు తప్పక అవుతాయని అన్నారు……..

  •  
  •  
  •  
  •  

Comments