జ‌న‌సేనానిపై బాబు అడ్డ‌గోలు కుట్ర‌!

Tuesday, September 25th, 2018, 03:00:44 AM IST

ప్ర‌జా జీవితంలో ఉన్న‌వాళ్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం అన్న‌ది ప్ర‌భుత్వాల విధి. పార్టీల‌క‌తీతంగా ఏ పార్టీ నాయ‌కుడు అయినా ప‌బ్లిక్ మీటింగుల‌కు వెళుతున్నారంటే భ‌ద్ర‌త క‌ల్పించి తీరాల్సిందే. అయితే అందుకు విరుద్ధంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై క‌క్ష క‌ట్టి మ‌రీ భ‌ద్ర‌త లేకుండా చేయ‌డం జ‌న‌సేన అభిమానుల్లో, ఏపీ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాపుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. చంద్ర‌బాబు జులుం అన్ని కోణాల్లోనూ ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌రిశీలిస్తున్నారు. నిన్న‌టిరోజున ప‌వ‌న్ నెల్లూరు రొట్టెల పండ‌గ‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ జ‌నం మ‌ధ్య‌లో చిక్కుకుని చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అయితే అదంతా చంద్ర‌బాబు నాయుడు కావాల‌ని చేసిన కుట్ర అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ నెల్లూరు ప‌ర్య‌ట‌న వ‌స్తున్నారు అన‌గానే అక్క‌డ భ‌ద్ర‌త‌ను పెంచాల్సి ఉంది. పోలీస్ బ‌ల‌గాలు, బందోభ‌స్తు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కావాల‌నే తేదేపా ప్ర‌భుత్వం పోలీసుల‌ను విధుల‌కు వెళ్ల‌కుండా నిలువ‌రించింద‌ని తెలుస్తోంది. దాని వ‌ల్ల ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని స‌న్నివేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌నం మ‌ధ్య ఏకంగా 20 నిమిషాల పాటు చిక్కుకుపోవాల్సి వ‌చ్చింది. ఓవైపు జ‌న‌సేనాని అభిమానులు వెల్లువ‌లా ఆ స్థ‌లానికి పోటెత్తారు. కొంద‌రైతే ప‌వ‌న్‌కి మెడ‌లో కండువా వేసేందుకు, నెమ‌లిపింఛంతో ఆయ‌న‌ను ఆశీర్వ‌దించేందుకు ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నించారు. ప‌లువురు అభిమానుల సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డారు. అయితే అక్క‌డ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నియ‌మించుకున్న వ్య‌క్తిగ‌త ప్ర‌యివేటు సిబ్బంది ప‌రిమితంగా ఉన్నారు. అర‌కొర‌ పోలీస్ త‌ప్ప వేరే సెక్యూరిటీ అన్న‌దే లేకుండా పోయింది. అలాగే ద‌ర్గాలోనికి వ్య‌క్తిగ‌త సిబ్బందిని అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ఎంతో ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. మొత్తానికి అస‌లు ఈ ప‌ర్య‌ట‌న జ‌ర‌గ‌కూడ‌ద‌ని భావించిన చంద్ర‌బాబు చాలానే కుయుక్తులు ప‌న్నారు. అయినా మొండి ప‌ట్టు వీడ‌ని ప‌వ‌న్ అన్నంత ప‌నీ చేశారు. అక్క‌డ ప‌వ‌న్‌కి వెల్లువెత్తిన అభిమానం చూశాక చంద్ర‌బాబు సైతం ఖంగు తినాల్సి వ‌చ్చింది. జ‌న‌సేనానిపై చంద్ర‌బాబు చేస్తున్న కుట్ర‌ల‌న్నీ ప్ర‌జ‌లు నేరుగా చూస్తున్నారు. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి జ‌నంలో ఇమేజ్ అంత‌కంత‌కు పెంచుతోంది.