ఎన్టీఆర్ బయోపిక్: తన పాత్రను తెరపై చుసిన బాబు స్పందన ఇదీ..!

Friday, January 11th, 2019, 10:40:50 AM IST

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా, బాలకృష్ణ నటించి, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. బుధవారం విడుదలైన ఈ సినిమాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్‌లో బాలకృష్ణ, క్రిష్, మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, విప్ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తదితరులతో కలిసి చూసారు.
సినిమా చాలా అద్భుతంగా ఉందని, పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయని బాబు అన్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ఇందులో చూపించారని, ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇదని అన్నారు.

ఈ సినిమాలో తన పాత్రపై విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. “నా పాత్ర ఎలా ఉందన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు” అని పేర్కొన్నారు. నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. సినిమాను క్రిష్ అద్భుతంగా తీశారని, బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో జీవించాడని, ఎన్టీఆర్ గారే మళ్లీ వచ్చి నటించినట్లుందని కొనియాడారు. ఇదిలా ఉండగా చంద్రబాబు పాత్ర ఈ సినిమాలో ఉన్నది ఒకటి, రెండు సీన్లే అని మహానాయకుడులో ఎక్కువ శాతం ఉండనుందని సమాచారం, మరి అందులో బాబు పాత్రను ఎలా తీర్చిదిద్దారో, దానిపై బాబు ఎలా స్పందించారో చూడాలి.