వాస్తవాలను చూపండి!

Saturday, September 27th, 2014, 01:14:35 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో కేంద్రమంత్రి వెంకయ్య నాయడుతో కలిసి దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తూ కేంద్రమంత్రి వెంకయ్యపై ప్రశంశల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్య వాగ్ధాటికి అంతులేదని, రాజీలేని తత్వం కారణంగానే అంచలంచెలుగా ఎదిగి దక్షిణ భారతదేశానికి ప్రతినిధిగా ఉన్నారని కితాబు ఇచ్చారు.

చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, పునాదుల నుండి ఏపీని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. అయినప్పటికీ సవాళ్ళను ఎదుర్కొని ప్రగతి సాధిద్దామని బాబు పేర్కొన్నారు. ఇక నూతన రాజధాని విషయంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని, ప్రజా రాజధానిగా కొత్త రాజధాని ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలుపుకొని మెగాసిటీగా రూపొందిస్తామని బాబు తెలిపారు. అటుపై మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ మీడియా సంస్థలు వాస్తవాలను చూపాలని, వివాదాలకు తావులేని వార్తలను ప్రసారం చెయ్యాలని చంద్రబాబు సూచించారు. ఇక అక్టోబర్ 2న స్వచ్చా ఆంధ్రప్రదేశ్ కోసం ర్యాలీ నిర్వహిస్తామని, ప్రజలు స్వచ్చందంగా అందులో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.