చంద్ర‌బాబుకు ఊహించ‌ని విధంగా.. టీడీపీలో మ‌రో కీల‌క వికెట్ అవుట్..!

Thursday, December 6th, 2018, 11:20:41 AM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా అయిన చిత్తూరు జిల్లాలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. పీలేరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ సీనియ‌ర్ నేత మాజీ ఇంచార్జ్ ఇక్బాల్ మ‌హ్మ‌ద్ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాకుండా ఆయనతో పాటు ఆయన మద్దతు దారులు మరో 20మంది కూడా పార్టీకి రాజీనామా చేయ‌డంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రెండు ద‌శాబ్దాలకు పైగానే తెలుగుదేశం పార్టీ కోసం శ్ర‌మిస్తూ.. ఆ పార్టీ ఉన్న‌తికి కృషి చేసినా.. క‌నీస గుర్తింపు ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక ఇటీవ‌ల‌ చేరిన మాజీ ముఖ్య‌మంత్రి సోద‌రుడు, న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని చేర్చుకుని, ఆయ‌న‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డ‌మే కాకుండా నామినేటెడ్ ప‌ద‌విని కూడా ఇచ్చారని, అయితే గ‌తంలో తనకు నామినేటెడ్‌ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కలిసి అనేక సార్లు తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పినా.. ఆయ‌న‌ పట్టించుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో ఎన్నోఏళ్లుగా శ్ర‌మిస్తున్న వారిని ప‌ట్టించుకోకుండా, కొత్త‌గా వ‌చ్చిన వారిని అంద‌లం ఎక్కించ‌డంతోనే ఇక్బాల్ టీడీపీకి రాజీనామా చేశాన‌ని తెలుస్తోంది. మ‌రి ఏపీలో కూడా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యాన ఇక్బాల్ ఏ పార్టీలో చేర‌తాడో చూడాలి.