కాపులకిచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలి: ముద్రగడ

Monday, February 12th, 2018, 09:26:19 AM IST

తెలుగు దేశం పార్టీ అద్యక్షులు చంద్రబాబు నాయుడు క్రితం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ప్రతిపక్ష పార్టీ లు విమర్శిస్తున్న సంగతి విదితమే. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న బాబు ప్రత్యేక ప్యాకేజీ తో సరిపెట్టారని ఎద్దేవా చేస్తున్నారు. అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం ఏపీ కి ఇచ్చిన నిధుల వివరాల నివేదికను తనకు 15 వ తేదీలోగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే మరోవైపు ఆ మధ్య చంద్రబాబు ను కాపుల రిజర్వేషన్ ల విషయం లో ముప్పతిప్పలు పెట్టి ప్రస్తుతానికి కొంత శాంతించిన ముద్రగడ పద్మనాభం, కాపులకిచ్చిన హామీని మార్చి 31లోపు అమలు చేయాలని, లేదంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం.

కాపుల బాధలను ముఖ్యమంత్రి చంద్రబాబు పెడచెవిన పెట్టారని ముద్రగడ ఆరోపించారు. ఈ కారణంగానే కాపులు రోడ్డెక్కవలసి వచ్చిందన్నారు. కాపు ఉద్యమం చేస్తున్నందుకు తాను తన కుటుంబం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామన్నారు. తమను బిసి ఈ గా ప్రవేశపెట్టడమే కాదు త్వరలోనే ఆ బిల్లుకు ఆమోదం తెలిపి అమలు చేయాలని తద్వారా తమ కాపు జాతికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ ఉద్యోగాల ప్రకటనలు వెలువడుతున్న సందర్భాంగా ఇంకా ఆలస్యం చేయవద్దని ఆయన కోరుతున్నారు. తననే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులను కూడా చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఎన్నికలవేళ కాపులకు ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చాక విస్మరించడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. రిజర్వేషన్ ఐదు శాతం కాకుండా హామీ ఇచ్చినట్లు పది నుంచి పన్నెండు శాతం ఇవ్వాలని ముద్రగడ అన్నారు. కావున చంద్రబాబు ఇకనైనా మేల్కొని తమ కాపు వర్గానికి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు….