బాబుగారూ ఆడపడుచులపై ఏమిటీ అమానుషం?

Wednesday, August 8th, 2018, 03:38:37 AM IST

వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ అక్కడి స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు గత ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వైసిపి ఓటమికి గల కారణాలను ఆయన తెలుసుకుంటున్నారని, రాబోయే ఎన్నికల సమయంకల్లా ఇక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు వున్నాయి, ఒకవేళ అధికారంలోకి వస్తే వారికీ ఎంతవరకు సమస్యలు తీర్చగలం అని అంచనా వేస్తున్నారని అంటున్నారు. అలానే ఎటువంటి అభ్యర్థులను బరిలో నిలపాలి, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై ఇక్కడి ప్రజలు ఎటువంటి అభిప్రాయంతో వున్నారు తదితర అంశాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారట. ఇక నేడు ఆయన టీడీపి అధినేత మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేసారు. చంద్రబాబు నాయుడుగారు రాష్ట్రంలోని ఆడపడుచుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని, మహిళలు కూడా ఆర్ధికంగా ఎదిగితేనే వారి కుటుంబాలు ఆనందంగా జీవనాన్ని సాగించగలవు అంటూ మాటలు చెప్పే బాబు గారు, వారికీ తీరని అన్యాయం చేసారని అన్నారు. అధికారం వుందికదా అని మీరు ఆడవారిపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అంటూ విమర్శించారు.

విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఏపీలో మధ్యాహ్న భోజన పధకాన్ని అమలుచేస్తూ నిత్యం వేలాది మంది పిల్లలకు వండివారుస్తున్న మహిళలను కాదని, చంద్రబాబునాయుడు ప్రైవేట్ ఏజెన్సీలకు వాటిని కట్టబెట్టడం అన్యాయమని జగన్ అన్నారు. మీరు కొన్నినెలలుగా సరిగ్గా బిల్లులు చెల్లించకపోయినా, వారికీ అరకొర వేతనాలు ఇస్తున్నా కూడా అక్కడక్కడా అప్పులు చేసి ఆ మహిళలు పిల్లలకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారికీ మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిపోయి వారికి అన్యాయం చేయడమేంటని ప్రశ్నించారు. ఒకప్పుడు విజయవాడలో మహిళా పార్లమెంట్ నిర్వహించామని గొప్పలు చెప్పుకున్న మీరు, అదే విజయవాడలో అక్కాచెల్లెళ్ల పట్ల వ్యవహరించిన తీరు సిగ్గుచేటు కాదా అంటూ మండిపడ్డారు. దీనికి రాబోయే ఎన్నికల్లో ప్రజలనుండి టీడీపీ తగిన మూల్యం తప్పక చెల్లించుకోవలసి వస్తుందని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారాన్ని చేపడితే మధ్యాహ్న భోజన పధకాన్ని అన్ని చోట్ల కూడా అక్కచెల్లెమ్మలకు ఇస్తామని, అలానే వారికీ గౌరవ వేతనం కూడా మరింత పెంచి, విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించే అన్ని ఏర్పాట్లు చేస్తామని మాటిచ్చారు…..

  •  
  •  
  •  
  •  

Comments