జనసేన, వైసీపీ లాంటి పార్టీలు మనకి అవసరమా.?బాబు సంచలన వ్యాఖ్యలు!

Wednesday, October 10th, 2018, 07:18:18 PM IST

ఇన్ని రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుని వైసీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు వారి వారి యొక్క యాత్రల్లో తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వచ్చారు.ఇప్పటికి అదే కొనసాగిస్తున్నారు.కానీ చంద్రబాబు కి తాను వారికి తిరిగి సరైన కౌంటర్లు ఇవ్వడానికి సరైన వేదిక ఈ మధ్య కుదరలేదనేమో కొన్ని రోజులు మౌనంగానే ఉన్నారు.కానీ ఈ రోజు అనంతపురం జిల్లా గరుడాపురం లో నిర్వహించినటువంటి సభలో బాబు గారు పవన్ మరియు జగన్ లు ఇద్దరికీ కలిపే సమాధానాలు ఇచ్చేసారు.

అనంతపురం జిల్లాలో ప్రాంతాలకు నీటి పారుదలను విరివిగా అందజేస్తుంటే వైసీపీ వారు వారి యొక్క ఓట్లు పోతాయేమో అని కావాలనే ఇక్కడికి ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారని,అదే సందర్భంలో జగన్ కోసం మాట్లాడుతు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దివాలాకోరు ప్రతిపక్ష నేతను ఎప్పుడు చూడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.అవగాహన లేనటువంటి నాయకుడు,ప్రజా సమస్యలు పట్టించుకోని ఇలాంటి ప్రతిపక్ష నేతను తాను చూడలేదని పేర్కొన్నారు.

అంతే కాకుండా జనసేన అధినేత పవన్ పై మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో పవన్ బాబుని తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసినదే.తాను ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటకి వచ్చానో అప్పటి నుంచి పవన్ కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనలేదని వ్యాఖ్యానించారు.తాము అవిశ్వాస తీర్మానం పెడితే తమకి అన్ని పార్టీల ఎమ్మెల్యేల మద్దతు కూడగడతానని,చెప్పిన పవన్ వారు అవిశ్వాసం పెట్టిన తర్వాత ఎక్కడికి పోయారు అని ప్రశ్నించారు. అంతే కాకుండా పవన్ పెట్టిన జాయింట్ ఫాక్ట్ కమిటీ లో ఆంధ్రప్రదేశ్ కు 75వేల కోట్లు రావాలని ఆయనే చెప్పారు అని కానీ ఆ విషయంపై కూడా ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించలేదని బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.