చంద్రబాబును స‌స్పెండ్ చేస్తూ లేఖ.. రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు..!

Tuesday, November 13th, 2018, 05:40:05 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి జోరందుకుంది. ముఖ్యంగా తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో జ‌రుగ‌నుండ‌డంతో అక్క‌డ అన్ని పార్టీలు గెలుపు కోసం త‌మ‌దైన ప్ర‌చారాల‌తో దూసుకుపోతున్నారు. ఇక మ‌రోసారి టీఆర్ఎస్‌కు తిరుగేలేద‌నుకున్న త‌రుణంలో అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చిన మ‌హాకూట‌మి గ‌ట్టి పోటీ ఇచ్చేలా క‌న‌బ‌డుతోంది. ఇక ఈ మ‌హాకూట‌మిలో టీడీపీ భాగం కావ‌డంతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి చ‌క్రం తిప్పేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ నేత‌లు చంద్ర‌బాబును టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

ఈ నేప‌ధ్యంలో తాజాగా తెర‌పైకి వ‌చ్చిన ఓ లేఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1995 ఆగస్టు సంక్షోభం తర్వాత అప్పటి ముఖ్య‌మంత్రి ఎన్టీరామారావు.. మంత్రిగా ఉన్న చంద్ర‌బాబును సస్పెండ్ చేస్తూ.. రాసిన లేఖ తెర‌పైకి వ‌చ్చింది. నాడు శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా ఎమ్మెల్యేలంద‌రితో వైస్రాయ్ హోట‌ల్‌లో స‌మ‌వేశం అయ్యి క్యాంపు రాజ‌కీయ‌ల‌కు తెర‌లేపారు. ఎన్టీఆర్ త‌ర్వాత టీడీపీలో ల‌క్ష్మీపార్వ‌తి ప‌ట్టు సాధిస్తుండ‌డంతో జీర్ణించుకోలేక‌పోయిన‌ చంద్ర‌బాబు.. ఎన్టీఆర్ లేని టైమ్ చూసుకొని ఎమ్మెల్యేలంద‌రినీ ఒక చోటుకు చేర్చి త‌న గుప్పిట్లో పెట్టుకున్నారు.

అయితే ఈ విష‌యం తెలుసుకున్న ఎన్టీఆర్ వైస్రాయ్ హోట‌ల్‌కొ వెళ్ళి ఎమ్మెల్యేల‌ను తిరిగి రావాల‌ని అభ్య‌ర్దించ‌గా ఫ‌లితం లేక‌పోయింది. ఇక ఆ త‌ర్వాత కాచిగూడ‌లోకి బ‌సంత్ టాకీస్‌ల‌తో ఏర్పాటు చేసిన మినీ మ‌హానాడుల ఎన్టీఆర్‌ను టీడీపీ అధ్య‌క్షుడిగా తొల‌గించి తాను అధ్య‌క్షుడు అవ‌డ‌మే కాకుండా.. సెప్టెంబ‌ర్ ఒక‌టిన ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే నాడు జ‌రిగిన వ్య‌వ‌హారం ఇప్పుడెందుకు తెర‌పైకి వ‌చ్చిందంటే.. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు తెలంగాణ‌లో జ‌రుగ‌నున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌కోసం బ‌ద్ద‌శ‌త్రువైన కాంగ్రెస్‌తో చేతులు క‌లిపారు. దీంతో చంద్ర‌బాబును టార్గెట్ చేసిన వారు.. టీడీపీ నుంచి బాబును సస్పెండ్ చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జారీ చేసిన లేఖను సోష‌ల్ మీడియాలో వ‌దిలారు.. దీంతో ఆ లేఖ ఇప్పుడు సోష‌ల్ మీడియాలోనే కాకుండా రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతోంది.