కర్ణాటక ప్రజల తీర్పుతో ఆలోచనలో పడ్డ చంద్రబాబు!

Tuesday, May 15th, 2018, 02:57:57 PM IST

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు నేడు తేలనున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం కన్నడనాట బిజెపి ముందుకు దూసుకెళుతోంది. ఇప్పటికే అక్కడ అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఏమి కాలేదని, తుదిదశ కౌంటింగ్ అయ్యేసరికి తమ పార్టీ ముందంజలో ఉండడం ఖాయమని చెపుతోంది. మరోవైపు జేడీఎస్ పరిస్థితి అందరు వూహించిందేనని, వారు దాదాపుగా మూడవ స్థానికి సరిపెట్టుకోవాల్సి వస్తుందని ఫలితాలు చెపుతున్నాయి. ఇక బిజెపి గెలుపు చాలా వరకు ఖాయంగా కనిపించడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం పై మాట తప్పిన బిజెపి నేతలు కర్ణాటకలో కూడా ఓటమిపాలు అవుతారని ఆయన ఇటీవల వ్యాఖ్యలు చేసారు.

అంతేకాదు కర్ణాటకలోని తెలుగు ప్రజలు ఎవరూ బిజెపికి ఓటువేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఇప్పుడు అక్కడ బిజెపి గెలుపు ఖాయం కావడంతో వారి తర్వాత టార్గెట్ ఏపీ పైనే ఉండనుందట. ఇప్పటికే టీడీపీతో మిత్రత్వం నుండి విడిపోయిన బిజెపి ఇకపై చంద్రబాబు పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారం దక్కించుకోకపోయినా మంచి మెజారిటీ పొందాలంటే బిజెపి మరింతగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఓవైపు కేంద్రం నుండి నిధులు రావడం లేదు, ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి ఇస్తానన్న నిధులు ఇవ్వడంలో పూర్తిగా మొండి చేయి చూపించింది అని టీడీపీ వారు బిజెపి పై చేసిన నిందారోపణలు తప్పుని ఏపీ బిజెపి నేతలు చెపుతున్నప్పటికీ టీడీపీ ఎదురు దాడి మాత్రం ఆగడంలేదు. అయితే ఈ విషయమై బిజెపి నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలని, అవసరమైతే చంద్రబాబు ప్రభుత్వం తమ పార్టీపై చేస్తున్న నిందారోపణలు, అసత్య ప్రచారాలపై లోతుగా విచారణ జరిపి ప్రజలముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం.

ఏ విధంగానూ ఆంధ్రాలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధికారంలోకి రాకుండా జరిగిన నిజానిజాలను బయటపెట్టడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని కొందరు బిజెపి నేతలు అంటున్నారు. ఇక మరోవైపు టిడిపి నేతలు మాట్లాడుతూ, బిజెపి వారు వైసీపీతో రహస్య ఒప్పందం పెట్టుకున్న విషయం అందరికి తెలిసిందేనని, జగన్ తన కేసుల నుండి బయటపడేందుకు మోడీ కాళ్ళు పట్టుకున్నారని, అందుకే ఇటీవల విజయసాయి రెడ్డికి ప్రధాని అప్పాయింట్మెంట్ ఇచ్చారని ఆరోపించిన విషయం తెలిసిందే. తమను అణచివేయాలని జగన్, మోడీ కలిసి కుట్రపన్నుతున్నారని అంటున్నారు. అయినా బిజెపి ఆటలు ఆంధ్రలో కుదరవని, వారు మనకు చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ఆంధ్రాలోనే కాదు దేశం ,మొత్తం కూడా మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై గుర్రుగా వున్నారనేది టిడిపినేతల వాదన. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బిజెపి, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు చేస్తున్న ఈ నిందారోపణలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాలి……

  •  
  •  
  •  
  •  

Comments