దావోస్ నుంచి చంద్రబాబు వీడియో కాల్ తో పుకరించిన గ్రామం..!

Tuesday, January 23rd, 2018, 10:00:35 PM IST

చంద్రబాబు ప్రారంభించిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫలితాలని ఇస్తోంది. తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండలంలోని జాజి వలస గ్రామానికి కనీసం ఫోను సదుపాయం కూడా లేదు. కొండ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీ తక్కువ. కొత్తవారు అక్కడికి వెళితే ఇబ్బదులు తప్పవు. గిరిజనులు ఉండే ఈ ప్రాంతం రాంపచోడవరం నుంచి 80 కిమీ దూరంలో ఉంటుంది. ఆ గ్రామానికి కూడా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇంటర్నెట్, కేబుల్ టివి మరియు ఫోను కనెక్టివిటీ ని కల్పించని చంద్రబాబు ఆదేశించారు. అనేక వ్యయ ప్రయాసలు పడ్డ అధికారులు నేటికి ఆ పని పూర్తి చేశారు. దీనితో చంద్రబాబు స్వయంగా ఆ గ్రామ ప్రజలతో దావోస్ నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.

దావోస్ నుంచే చంద్రబాబు జాజి వలస గ్రామ ఫైబర్ గ్రిడ్ ని ప్రారంభించారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేయడంతో ఆ గ్రామం మొత్తం ఆనంద డోలికల్లో మునిగిపోయింది. వీడియో కాల్ లో గ్రామప్రజలతో మాట్లాడిన చంద్రబాబు.. మీకందించిన సాంకేతిక సదుపాయం ఎలా ఉంది అని గ్రామస్తులని ప్రశ్నించారు. సారూ.. మీతో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సారు. మా ఊరికి ఫోను ఇచ్చారు.. మీకు కృతజ్ఞతలు సారూ అంటూ జాజివలస మహిళలు చంద్రబాబుతో అన్నారు. ఒక్క పోను ఏమిటమ్మా.. కేబుల్ టివి, ఇంటర్నెట్ అన్ని సదుపాయాలు మీ ఊరికి వచ్చాయి. దీని వలన మీకు తెలియని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అని చంద్రబాబు మహిళలతో అన్నారు. మా ఊరికి రోడ్లు కూడా వేయిస్తున్నారని మహిళలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఫైబర్ నెట్ సంస్థని కూడా అభినందించారు. ఇదే తరహాలో కనెక్టవిటీ లేని గ్రామాలకు ఈ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. టెలిఫోను, కేబుల్ టివి మరియు ఇంటర్ నెట్ సదుపాయాలని వైర్ లెస్ ద్వారా అందించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని ఫైబర్ నెట్ వర్గాలు తెలిపాయి.