జగన్ ను తిట్టి బాబు చేతిలో బుక్కైన టీడీపీ నేత !

Wednesday, October 31st, 2018, 12:52:17 PM IST

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన కత్తి దాడిని ముఖ్యమంత్రి సహా టీడీపీ నేతలంతా కోడి కత్తి డ్రామా అంటూ హేళనగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ వివాదంలో చంద్రబాబు తనను తాను డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు తప్ప బాధ్యతాయుతంగా జగన్ ను పరామర్శించడం, ప్రత్యేక దర్యాప్తు జరపడం లాంటివేవీ చేయలేదు. ఈ తీరు పట్ల ప్రజల్లో సైతం కొంత అసహనం వ్యక్తమవుతోంది.

స్వయంగా ముఖ్యమంత్రే జగన్ విషయాన్ని టేక్ ఇట్ ఈజీ అంటుండటంతో మిగిలిన దేశం నేతలు ఎవరికిష్టమొచ్చినట్టు వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న సోమిరెడ్డి తాము ప్లాన్ చేస్తే గీసుకోవడం, గుచ్చుకోవడం ఉండదని అర్థం పర్థం లేకుండా మాట్లాడగా నిన్న సోమవారం ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అయితే మరీ దిగజారిపోయి వైఎస్ కుటుంబంలోనే కలహాలు ఉన్నాయని, జగన్ హత్యాయత్నం వెనుక అతని తల్లి విజయమ్మ, సోదరి షర్మిళల హస్తం ఉందని అన్నారు.

ఈ వ్యాఖ్యలు విన్న ప్రజలు అసలు వీళ్లకు విలువలున్నాయా అని తిట్టుకుంటున్నారు. చంద్రబాబుకు కూడ రాజేంద్రప్రసాద్ మాట్లాడిన తీరు అస్సలు నచ్చలేదు. అందుకే రాజేంద్రప్రసాద్ ను మీ మాటలు హుందాగా లేవని, ఇలాంటి విషయంలో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని గట్టి వార్నింగ్ ఇచ్చారట. దీంతో ప్రెస్ మీట్లు పెట్టి ఎడా పెడా మాట్లాడేస్తున్న టీడీపీ నేతలంతా తన స్క్రిప్ట్స్ చేంజ్ చేసుకునే పనిలో పడ్డారని టాక్.