కొట్లాడుకుని పార్టీ ప‌రువు బ‌జారుకీడ్చారో….?!

Friday, November 4th, 2016, 01:55:29 AM IST

chandrababu
క్ర‌మ‌శిక్ష‌ణ అంటే తేదేపా, తేదేపా అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌. అయితే ఇది 2014 ఎన్నిక‌ల వ‌రకే. అటుపై రాష్ట్ర విభ‌జ‌న‌తో తేదేపాలో బోలెడ‌న్ని అంత‌ర్గ‌త పోరాటాలు ర‌చ్చ‌కెక్కాయి. పార్టీలోకి ఇరుగు పొరుగు పార్టీల నేత‌లు వ‌చ్చి చేర‌డంతో ఇన్న‌ర్‌గా ర‌చ్చ ర‌చ్చ అవుతోంది. ఇటీవ‌లి కాలంలో చిత్తూరు, ప్ర‌కాశం స‌హా ప‌లు చోట్ల గొడ‌వ‌ల‌తో నేత‌లు ర‌చ్చ‌కెక్కారు. దీంతో ఈ విష‌యంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియ‌స్‌గా ఉన్నార‌ని చెప్పుకుంటున్నారు.

ఇటీవ‌లే బాబు ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో.. ఎ1 కన్వెన్షన్ హాల్‌లో జ‌రిగిన పార్టీ ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో నేత‌లంద‌రికీ ఓ రేంజులో వార్నింగ్ ఇచ్చారు. కొట్టాడుకుని పార్టీ ప‌రువు బ‌జారు కీడ్చారో .. ఇక తాట తీస్తానంటూ బాబు హుంక‌రించారుట‌. పార్టీకి న‌ష్టం వాటిల్లితే ఆ ఫ‌లితం అనుభ‌వించాల్సిందే అంటూ నాయ‌కుల‌కు సూచించారు సీఎం. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ప్రభుత్వ కార్పొరేషన్లు, నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తాం. శ్ర‌మించిన వారికే ప‌ట్టంగ‌డ‌తామ‌ని బాబు అన్నారు. మొత్తానికి వైకాపా నుంచి వ‌చ్చిన నేత‌ల‌తో లాలూచీ ప‌డుతున్న నేత‌లంద‌రికీ బాబు సూటిగానే వార్నింగ్ ఇచ్చారు. అలాగే తేదేపాలోనే ఉంటూ ఒక‌రి పుట్టి ముంచేందుకు వేరొక‌రు పాకులాడినా .. అలాంటి వారికి శంక‌ర‌మాన్యాలే అన్న చందాన బాబు వార్నింగ్ ఇచ్చార‌న్న‌మాట‌!