కాంగ్రెస్ తొత్తుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు : సోము వీర్రాజు

Thursday, May 17th, 2018, 08:34:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోమారు విరుచుకుపడ్డారు ఏపీ బిజెపి ఎమ్యెల్సీ, బిజెపి పార్టీ ఎలక్షన్ కన్వీనర్ సోము వీర్రాజు. కర్ణాటకలో తెలుగు వాళ్ళను బిజెకి ఓటెయ్యొద్దని చెప్పినపుడే చంద్రబాబు కుటిల బుద్ధి అక్కడివారికి అర్థమైందన్నారు. చంద్రబాబు అంతటితో ఆగకుండా కొందరు ఉద్యోగ సంఘాల నేతలను పంపి బిజెపికి వోటెయ్యొద్దని ప్రచారం చేయించారని, అయినప్పటికీ ఆయన ఎత్తులు పారలేదన్నారు. తెలుగు వారు అత్యధికంగా వుండే పద్మనాభనగర్లో బిజెపి 35 వెల్ ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. అయినా కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా అంటే చంద్రబాబుకు ఎందుకు అంత అనుమానమే అర్ధం కావడంలేదని, వాస్తవంగా అధిక సీట్లు వచ్చిన మాకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించడంతో తప్పేముంది అన్నారు.

చంద్రబాబు ఒకప్పుడు కాంగ్రెస్ తో కలిసి వారికి తొత్తుగా వ్యవహరించి ప్రభుత్వాలను కూల్చిన విషయాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. 1996లో అటల్ బిహారి వాజపేయి రాజీనామా వ్యవహారం జరిగింది చంద్రబాబు వంటి అప్పటి నేతలు మద్దతు ఇవ్వకపోవడం వల్లనే అన్నారు. అప్పుడు ఆయన కాంగ్రెస్, జేడీఎస్ తో కలిసి దేవెగౌడని ప్రధానిని చేశారన్నారు. ఆ తరువాత మళ్ళి కాంగ్రెస్ తో కుమ్మక్కై ఆయన్ని కూడా పదవినుండి దించి ఐకే గుజ్రాల్ ను ప్రధానిని గద్దెనెక్కించిన విషయాలు ఎప్పటికి మరువలేమన్నారు. దీన్నిబట్టి చూస్తే ఆయన ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కి తొత్తు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరంలేదన్నారు. చంద్రబాబు వంటి నేతలు ప్రస్తుత ఎన్నికల్లో ఎన్ని నాటకాలాడినా తమ ఓటింగ్ 19 నుంచి 35 శాతానికి పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదని, తగ్గదని మండిపడ్డారు.

మొత్తంగా 104 స్థానాలు పొంది మరొక 20 స్థానాల తేడాతోనే ఓడిపోయామన్నారు. చంద్రబాబు కేవలం మోడీని, బిజెపిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ఆయన పాలన పై సరిగా దృష్టి పెట్టకడపోవడం వల్లనే ప్రతుతం రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు చూస్తున్నాం కదా అన్నారు. రాష్ట్రాన్ని రక్షించవలసిన ఆయన ప్రజలతో నన్ను రక్షించాలి అనడం విడ్డూరమని, అటువంటి నాయకుడు మనల్నిఎలా పరిపాలిస్తాడని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆడపిల్లపై జరుగుతున్న అత్యాచారాల వల్ల వారి తల్లితండ్రులు అయోమయంలో పడుతున్నారని, అటువంటి వారికి ముఖ్యమంత్రి గట్టి భరోసా ఇచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని, ఆవిధంగా ఆలోంచించకుండా ఇతరపార్టీల నేతలపై నిందలు వేసి, లేనిపోని తప్పులను ఎత్తిచూపడం వల్ల వారి పార్టీకే చెడ్డ పేరు వస్తుందని అన్నారు. కావున ఇకనైనా చంద్రబాబు రాష్ట్ర సంక్షేమం పై దృష్టిపెట్టి పాలనా సాగించాలని హితవుపలికారు…..