ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం : వైసిపి ఎమ్యెల్యే రోజా

Wednesday, May 9th, 2018, 05:22:23 PM IST

వైసిపి ఎమ్యెల్యే రోజా అంటేనే ఫైర్ బ్రాండ్ అనే విషయం అందరికి తెలుసు. కాగా ప్రస్తుతం ఆమె మరోమారు టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మూడేళ్ళ క్రితం పెను సంచలనమ్ సృష్టించిన ఓటు కు నోటు కేసును మళ్లి తిరగతోడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కేసును రివ్యూ చేయమన్న ఆయన, ఈ కేసులో దోషులుగా తేలిన వారు ఎవరైనా సరే వాళ్ళని వదిలేది లేదని ఇటీవల ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ విషయమై వైసిపి ఎమ్యెల్యే రోజా మాట్లాడుతూ కేసీఆర్ ఇన్నాళ్ళకైనా మళ్ళి ఆ కేసును రివ్యూ చేస్తున్నందుకు ధన్యవాదాలు అన్నారు.

అంతే కాదు ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. బాబుకు జైలుకు వెళ్తాను అనే భయం ముందే పట్టుకుందని, అందుకే తమపార్టీలోని కొందరు నేతలను ముందస్తుగా కాంగ్రెస్, టిఆర్ ఎస్ లోకి పంపుతున్నారని అన్నారు. రేపొద్దున ఏదైనా అవసరమొస్తే తనను ఆదుకునేందుకు వీలుగా చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. అందుకే ఈ మధ్య తన ప్రియతమ శిష్యుడైన రేవంత్ రెడ్డిని కాంగ్రెసులోకి, అలానే మరికొందరు నేతలను టిఆర్ఎస్ పార్టీలోకి పంపారని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆలా చేసి ఉంటారని అన్నారు. చంద్రబాబుకు తన అవసరాన్ని బట్టి ఎవరితోనైనా పొత్తులు పెట్టుకునే అలవాటు ఉందని, కానీ తమ పార్టీ మాత్రం టీడీపీతో ఎన్నటికీ కలవదని అన్నారు.

చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని, దానికి సాక్ష్యమే ఇటీవల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అన్నారు. బాబు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఓటుకు నోటు కేసులో బయటపడడం కుదరదని, ముందస్తు జాగ్రత్త చర్యగా ఇటీవల అమరావతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆహ్వానించి ఆయనకు భారీ విందు ఏర్పాటు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసారు…….