అప్పుడు తొక్కేసి.. ఇప్పుడు లేవమంటే ఎలా బాబు !

Monday, September 24th, 2018, 10:39:31 AM IST

రాజకీయ నాయకులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్ని కళ్ళకు గంతలు కట్టి మరీ నడిపిస్తారనడానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటి నుండి వస్తున్న మాటలే సాక్ష్యం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఒప్పందం మీద టీడీపీ, బీజేపీతో చేతులు కలిపి 2014 ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఎన్నికలు ముగిశాక దక్కాల్సిన ఫలితం దక్కాక మోదీ ఏపీకి మొండి చేయి చూపించారు.

ముందేమో హోదా అని ఆ తర్వాత ప్యాకేజీ భజన చేశారు. చంద్రబాబు కూడ కేంద్రం మాటలకి తలూపుతూ హోదా ఏమన్నా సంజీవనా, మనకి ప్యాకేజీ చాలు అన్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జనం, అవకాశం దొరోకిన ఇతర పార్టీలు రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు మొదలుపెట్టారు. ఆరంభం నుండి ఉక్కు పాదం కలిగి ఉన్న బాబు ధర్నా చేసిన చాలా మంది మీద కేసులు పెట్టేసి లోపల వేసియాన్ ఘటనలు చాలానే ఉన్నాయి. ఎవరైనా ఎక్కువ చేస్తే తొక్కేయడమే అన్నటువంటి సంకేతాలిచ్చారు బాబు.

కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండంతో ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీతో దోస్తీ కట్ చేసి
హోదానే మన ధ్యేయం, అందరూ ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే మోదీపై పోరాడాలి అంటూ ఉపన్యాసాలిస్తూ ప్రజల్ని ఉద్యమానికి సిద్ధం చేయాలనుకుంటున్నారు. ప్రజలంతా వేడిలో ఉండి, స్వచ్ఛందంగా పోరాటానికి దిగుతున్న అద్భుత తరుణంలో అధికారం ఉంది కదా అని వాళ్ళని తొక్కేసి, ఉద్యమాన్ని ఎక్కడికక్కడ నీరుగార్చేసి, నమ్మకాన్ని పోగొట్టుకుని ఇప్పుడేమో ఇలా లేవండి పోరాడదాం అనడం ఎంతవరకు తెలివైన చర్య అనిపించుకుంటుందో బాబుగారే ఆలోచించుకోవాలి.