శవాల మీద చిల్లర ఏరుకునేలాగా ఉంది చంద్రబాబు పాలన – జగన్ షాకింగ్ కామెంట్స్

Friday, December 7th, 2018, 04:00:39 AM IST

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిలకలపాలెంలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుని తీవ్రంగా విమర్శించారు. తన పాలనని మొత్తం తప్పు పడుతున్నారు. రాష్ట్రం ప్రజానీకం ప్రకృతి విపత్తులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు పక్క రాష్ట్రంలో పాలన సాగించేందుకు వెళ్లాడని, ఏపీ ప్రజలనే తనకి లెక్కలేదని విమర్శించారు. తిత్లీ తుపాను దెబ్బకు అతలాకుతలమైన ఉత్తరాంధ్రను పట్టించుకోకుండా చంద్రబాబు తెలంగాణలో ‘రాజకీయాలు’ చేస్తున్నాడని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ‘ఏ ప్రభుత్వాధినేత అయినా తుపాను రాకముందే జాగ్రత్త పడతారు. నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టి ప్రజలందరినీ కాపాడే ప్రయత్నం చేస్తారు కానీ చంద్రబాబు మాత్రం అసలే పట్టించుకోవడం లేదు.

తిత్లీ ప్రభావంతో ఏపీలో 3,435 కోట్ల నష్టం జరిగిందని బాబు కేంద్రానికి లేఖ రాస్తాడు. కానీ, బాధితులను ఆదుకోవడానికి ముందుకురాడు. కేవంల రూ.520 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటాడు. అంటే నష్టపోయిన దానిలో కేవలం 15 శాతం మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటాడు. ప్రభుత్వం ఎంతో చేసినట్టు బస్సులకు ఫోటోలు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటాడు. చంద్రబాబు వ్యవహారం ఎలా ఉందంటే..శవంపై చిల్లర ఏరుకునే తీరుగా ఉంది’ అని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. ఏ ప్రభుత్వమైనా కూడా నాణ్యతమైన విద్యని అందించేందుకు ముందుకు వస్తుంది కానీ టీడీపీ పాలన లో అసలు విద్య పై దృష్టి పెట్టిన వారే లేరని ఎద్దేవా చేశాడు. ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే 34 ప్రభుత్వ పాఠశాల్ని, 5 హాస్టళ్లు మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకుడిని నమ్మి పట్టం కట్టినందుకు తన బుద్ది చూపించాడని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

#