ఖైదీ సినిమాతో భారీ లాభాలు మిగుల్చుకున్న చరణ్ !

Tuesday, January 31st, 2017, 02:45:42 AM IST

ramcharan

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీ నెం 150’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి రెండు రోజుల క్రితమే రూ. 100 కోట్ల షేర్ ను సైతం కొల్లగొట్టి సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. పైగా సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలోనే జరిగింది. నిర్మాత చరణ్ ఎక్కడా వెనక్కు తగ్గకుండా, బేరసారాలకు తావు లేకుండా అన్ని ఏరియాల్లో సినిమాని ముందుగా నిర్ణయించిన భారీ మొత్తానికే విక్రయించాడు. ఈ లెక్కలన్నింటినీ కలిపితే ఈ సినిమాప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 110 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.

చిత్రం సొంతదే కనుక చిరంజీవి రెమ్యునరేషన్ మినహాయింపు ఎలాగూ ఉంది. చిత్ర బడ్జెట్ కూడా అటు ఇటుగా రూ. 40 కోట్ల చిల్లరే అయిందట. ఆ బడ్జెట్ మొత్తాన్ని పక్కనబెట్టగా చరణ్ కు సుమారు రూ. 70 నుండి 75 కోట్ల వరకు లాభాలు మిగిలుంటాయని సమాచారం. ఇలా కొడుకు చరణ్ కు నిర్మాతగా తోలి సినిమాతోనే కళ్ళు చెదిరే లాభాల్ని చవి చూసేలా చేశారు చిరంజీవి. చరణ్ కూడా తండ్రి ఇంత గొప్పగా లాభాలు తెచ్చి పెడుతుండటంతో ఆయన తరువాతి సినిమాను కూడా తానే స్వయంగా నిర్మించడానికి రెడీ అయిపోయాడు.