ఢిల్లీ బ్యాడ్ లక్.. చెన్నై టాప్ లక్!

Tuesday, May 1st, 2018, 09:33:30 AM IST

ఐపీఎల్ లో దాదాపు అన్ని జట్లు సగం మ్యాచ్ లను పూర్తి చేశాయి. పాయింట్స్ పట్టికలో టాప్ లో ఉండాలంటే ఇప్పటి నుంచే మంచి ఆట తీరును కనబరచాలి. హైదరాబాద్ – చెన్నై జట్లు టాప్ లో కొనసాగుతుండగా మిగతా జట్లు గెలుపోటములతో సతమతమవుతున్నాయి. ఢిల్లీ జట్టు పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. మొన్నటి మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ కి న్యాయకత్వ బాధ్యతలు అప్పగించగానే జట్టు సెట్ అయ్యింది అని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ ఓటమి బాట పట్టింది. నిన్న చెన్నై జట్టుతో ఢిల్లీ పోరాడి ఓడింది.

రిషబ్ పంత్ (79) తప్పితే ఎవరు అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ఇక చివరలో విజయ్ శంకర్ (54) మెరిసినప్పటికీ అప్పటికే రిక్వైర్డ్ రన్ రేట్ చాలా పెరిగిపోయింది. ఫైనల్ గా 13 పరుగుల తేడాతో చెన్నై విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు నిర్ణిత ఓవర్లలో 211 పరుగులు చేసింది. వాట్సన్‌ (78), ధోని (51), అంబటి రాయుడు (41) విరుచుకుపడడంతో జట్టు భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 10 పరుగులకే పృథ్వీ షా వికెట్ కోల్పోయింది. ఆ తరువాత మున్రో (26) పుంజుకున్నట్టు కనిపించినప్పటికీ వెంటనే అవుట్ అయ్యాడు.ఆ తరువాత వెంట వెంటనే శ్రేయాస్ అయ్యర్ – మ్యాక్స్ వెల్ అవుటవ్వడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైందని అంతా అనుకున్నారు. కానీ రిషబ్ పంత్ 79 (45) 7 ఫోర్లు 4 సిక్సులతో చెన్నై బౌలర్లను కలవరపెట్టాడు. కానీ చివర్లో క్యాచ్ ఇచ్చి వేనుదిరిగాడు. అనంతరం విజయ్ శంకర్ వరుస సిక్సర్లతో విజయాన్ని అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఎంగిడి కట్టుదిట్టమైన బౌలింగ్ వల్ల చెన్నైకి విజయం దక్కింది.