ఈ స్టంట్స్ అన్నీ అందుకోసమేనా చెవిరెడ్డి ?

Friday, May 17th, 2019, 05:22:38 PM IST

ఈమధ్య కాలంలో వైకాపా నుండి బాగా వినిపిస్తున్న పేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుండి ఈయన హడావుడి మొదలైంది. 2014లో చంద్రగిరి నుండి గెలుపొందిన ఈయన మొదట్లో పెద్దగా వార్తల్లో లేకపోయినా ఆ తర్వాత తన ఉనికిని గట్టిగా చాటుకున్నారు. నియోజకవర్గంలో తనను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయని పెద్ద డ్రామానే నడిపిన అయన ప్రచార సమయంలో గ్రామస్తులతో, ప్రత్యర్థి పార్టీలతో గొడవలకు దిగి పలుసార్లు అరెస్టై వార్తల్లో నిలుస్తూ వచ్చారు.

ఇక చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సక్రమంగా జరగకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చింది. రీపోలింగ్ నిర్వహించాలని కొన్ని రోజులు హంగామా చేశారాయన. ఆపై లక్ ఇంకాస్త కలిసొచ్చి ఈసీ ఉపఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుకున్నట్టే ఉపఎన్నిక రావడంతో మరింత తీవ్రంగా ఎలివేట్ అయ్యే పని పెట్టుకున్న చెవిరెడ్డి మళ్ళీ గొడవలు, అరెస్టులతో వార్తల్లోకి ఎక్కుతున్నారు.

ఇదంతా ఎందుకయ్యా అంటే రేపు వైకాపా గెలిస్తే మంత్రివర్గంలో చోటు కోసమని టాక్. అధికారం చేపడితే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వలనే విషయమై జగన్ ముందు నుండి ఒక లిస్ట్ వేసుకుని ఉన్నారు. అందులో చెవిరెడ్డి పేరు లేదు. ముందు నుండే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన అధినేత దృష్టిలో పడటానికి ఈ పాట్లన్నీ పడుతున్నారని లోకల్ లీడర్లు చెవులు కొరుక్కుంటున్నారు.