పొలిటిక‌ల్ టాక్ : విశాఖ టీడీపీ ఎంపీగా చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌..?

Friday, March 15th, 2019, 08:22:34 PM IST

విశాఖ ఎంపీ అభ్య‌ర్థిని ఫైన‌ల్ చేసే ప‌నిలో సీఎం చంద్ర‌బాబు టీడీపీ ముఖ్య నేత‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని, ఆ క్ర‌మంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుతోపాటు, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి పేర్ల‌ను ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. వీళ్ల‌ద్ద‌రితోపాటు చ‌ల‌సాని శ్రీ‌నివాస్ పేరు కూడా చంద్ర‌బాబు దృష్టిలో ఉంద‌ని, రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌త్యేకంగా ప్ర‌చారం సాగుతోంది. అయితే, చ‌ల‌సాని శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి అధ్య‌క్షులుగాను, అలాగే ఏపీ మేధావుల సంఘం అధ్య‌క్షుడిగాను ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ ఆయ‌న ఏ పార్టీకి చెందిన వ్య‌క్తి కాదు. ఆయ‌న విశాఖ‌కు చెందిన వ్య‌క్తి కూడా కాదు.

అయితే, ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం కావొచ్చు.. అలాగే ఏపీకి మోడీ సర్కార్ చేస్తున్న అన్యాయాలు కావొచ్చు.. ఇవ‌న్నీ కూడా చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌కు ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ క్ర‌మంలో విశాఖ‌ప‌ట్నం టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా చ‌ల‌సాని శ్రీ‌నివాస్ పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంద‌ట‌.

ఇలా విశాఖప‌ట్నం ఎంపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు పార్టీ నేత‌ల నుంచి మేధావుల వ‌ర‌కు అనేక కోణాల్లో చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ట‌. మ‌రికొన్ని పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌న్న గుస‌గుస‌లు టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయ‌ట‌. వీట‌న్నిటి కార‌ణంగానే విశాఖ టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిని నిర్ణ‌యించ‌డంలో జాప్యం జ‌రుగుతుంద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ చెబుతున్నాయి. అస‌లు సీఎం చంద్ర‌బాబు మ‌న‌సులో ఏముంద‌న్న‌దానిపై టీడీపీ నేత‌ల‌కే అంతు ప‌ట్ట‌డం లేద‌ట‌. ఈ ఎపిసోడ్‌కు త‌మ పార్టీ అధినేత ఇచ్చే ఫినిషింగ్ ట‌చ్ ఏంట‌న్న‌దానిపై తెలుగు త‌మ్ముళ్లు ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.