అక్కడ విడాకులు తీసుకున్న మహిళల్ని గోతిలో పడుకోబెడతారు !

Sunday, February 26th, 2017, 01:07:27 PM IST


భర్తతో విభేదించిన మహిళలు ఈ రోజుల్లో చాలామంది విడాకులు తీసుకునేందుకు ప్రాధాన్యతనిస్తారు. విడాకులు పొంది భర్త నుంచి దూరమయ్యాక చాలా మంది మహిళలు మానసిక క్షోభని అనుభవిస్తారు. ఆత్మహత్య ల వైపు వెళ్లేవాళ్లూ లేకపోలేదు. అలాంటి వారిచే కొత్త జీవితాన్ని ప్రారంభింపజేసేందుకు చైనాలోని లీ తైజి అనే యువతి సరికొత్త మెడిటేషన్ కు శ్రీకారం చుట్టింది. మహిళలు వారి గత అనుభవాలను మరచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభింపజేయడమే దీని ముఖ్య ఉద్దేశం.

లీ తైజి శ్రీకారం చుట్టిన మెడిటేషన్ పేరు గ్రేవ్ యార్డ్ మెడిటేషన్. భర్త నుంచి విడిపోయి మానసిక వేదనని అనుభవించే మహిళలు, ఆత్మహత్యకు సిద్ధపడిన మహిళలు కొత్త జీవితం ప్రారంభించేలా ఈ మెడిటేషన్ చేయిస్తారు. మనిషి మరణించాకా ఏవిధంగా అయితే గోతిలో పూడ్చి పెడతారో ఆవిధంగా మహిళలను గోతిలో ప్లాస్టిక్ కవర్ లపై పడుకోబెడతారు.మనిషి మరణించాక సాధించేది ఏమి లేదని, జీవితంలో సాధించాల్సింది చాలా ఉందని వారికి తెలియడానికి ఇలా చేస్తారు. మహిళల్ని గోతిలో పడుకోబెట్టి వారికి ఆలోచించుకునే సమయం ఇస్తారు. దీనిద్వారా చాలా మంది మహిళలు మరణించాలన్న ఆలోచన నుంచి బయట పడడమే కాకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించారని లీ తైజి చెబుతోంది.