మెగాస్టార్ ‘మెగాఫోన్’ పట్టనున్నారా?

Tuesday, October 28th, 2014, 01:21:14 PM IST


కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత అయిన మెగాస్టార్ చిరంజీవి త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించనున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. కాగా ఇటీవల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తీరని ఎదురు దెబ్బ తగిలిన నేపధ్యంలో చిరంజీవికి రాజకీయాల పరంగా కాస్త విరామం దొరికిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమయాన్ని మరలా సినిమాల్లోకి రీ ఎంట్రీ ద్వారా సద్వినియోగం చేసుకుందామని మెగాస్టార్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంగా చిరంజీవి 150వ చిత్రం త్వరలో రాబోతోంది అంటూ ప్రచారం కూడా జోరు గానే సాగింది. అయితే ఈ చిత్రానికి చిరు తనయుడు రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

కాగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యత తొలుత వివి వినాయక్ కు ఇస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ దానిపై అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ నేపధ్యంలో తాజాగా చిరంజీవే తన 150వ చిత్రానికి స్వీయ దర్సకత్వం చేయనున్నారని వార్తలు వ్యాపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే దీనిపై చిరు పెదవి విప్పేవరకు మరికొంత కాలం వేచి చూడాల్సిందే!