జనసేన చేరికలపై చిరంజీవి ప్రభావం !

Sunday, October 21st, 2018, 04:50:26 PM IST

దసరా పండుగ రోజున టీడీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబానికి మంచి పట్టున్న తిరుపతిలో ఇలా ఒక టీడీపీ నేత జనసేనలోకి జంప్ అవడం రెండు రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. చదలవాడ పార్టీ మారతాడనే ఊహాగానాలు ఉన్నా ఇలా ఉన్నపళంగా పార్టీని వీడటం తిరుపతి టీడీపీ వర్గాల్లో కంగారును కలిగించింది.

రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడటమే చదలవాడ టీడీపీని వీడటానికి ముఖ్య కారణమని బయట టాక్ ఉన్నా తాజాగా పార్టీ మారడానికి అసలు కారణం స్థానిక ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ వైఖరేనని ఆయన తెలిపారు. గత కొన్నాళ్లుగా సుగుణమ్మ భూకబ్జాలకు పాల్పడుతూ ఏ విషయంలోనూ తనను లెక్క చేయడంలేదని, కొంచెం కూడ గుర్తించడంలేదని చదలవాడ అన్నారు.

ఇక జనసేననే ఎంచుకోవడానికి కారణాన్ని కూడ తెలిపారాయన. తాను చిరంజీవి సినిమాల ద్వారా డబ్బు సంపాదించుకున్నానని, ఆయనంటే తనకు ఎంతో గౌరవం ఉందని, చిరు కుటుంబంలో పవన్ కళ్యాణ్ బలమైన వ్యక్తి కాబట్టే ఆయన పార్టీలో చేరానని, పదవులపై తనకు అసలు లేదని చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి పవన్ పార్టీలో చేరుతున్న వలస నేతలపై ఎక్కడో చిరంజీవి ప్రభావం కూడ కొంత ఉందని అర్థమవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments