చిత్ర‌పురి అధ్యక్షుడు ఎమ్మెల్యేగా పోటీ?

Monday, October 8th, 2018, 02:35:31 PM IST

24 శాఖ‌ల కార్మికులు కొలువుండే చోటు చిత్ర‌పురి కాల‌నీ. డా.ఎం.ప్ర‌భాక‌ర్ రెడ్డి చిత్ర‌పురి కాల‌నీగా పిలుస్తారు. ఈ కాల‌నీలో వేలాది మంది ఇప్ప‌టికే నివాసం ఉంటున్నారు. అయితే రానున్న ఎన్నిక‌ల్లో ఒక నియోజ‌క‌వ‌ర్గం భ‌విష్య‌త్‌ని శాసించే కాల‌నీగా చిత్ర‌పురి హాట్ టాపిక్ అయ్యింది. ఈ కాల‌నీ వాసులంతా గంప‌గుత్త‌గా ఏ అభ్య‌ర్థికి ఓటేస్తే ఆ అభ్య‌ర్థి గెలిచేందుకు వీలుంటుంద‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది. ఆ క్ర‌మంలోనే ఈ కాల‌నీ ఓట్ల‌కు గాలం వేసేందుకు తేరాస త‌ర‌పున కేటీఆర్, త‌ల‌సాని అంత‌టివాళ్లు కాల‌నీకి రెగ్యుల‌ర్‌గా విచ్చేస్తుంటారు. ఫంక్ష‌న్లు, వేడుక‌లు, పండ‌గ‌ల వేళ విచ్చేసి ఇది చేస్తాం.. అది చేస్తాం! అంటూ మీటింగులు పెడుతుంటారు.

ఇదివ‌ర‌కూ చిత్ర‌పురికి సంబంధించి ఓ మాజీ లేడీ ఐఏఎస్‌తో వ‌చ్చిన గొడ‌వ‌ను ప‌రిష్క‌రించి సాయ‌ప‌డ్డారు స‌ద‌రు నాయ‌కులు. సినిమా వాళ్లు కాబ‌ట్టి వీళ్ల‌కు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని అండా దండా ల‌భిస్తోంది. అయితే ఇటీవ‌లి కాలంలో ఈ కాల‌నీ నుంచి అదిరిపోయే హాట్ న్యూస్ ఫిలింస‌ర్కిల్స్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. చిత్ర‌పురి కాల‌నీ అధ్య‌క్షుడు కొమ‌ర వెంకటేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడ‌న్న‌ది ఆ వార్త సారాంశం. కాల‌నీ అధ్య‌క్షుడు ఎమ్మెల్యే అయితే అది త‌మ‌కు లాభిస్తుంద‌ని కాల‌నీవాసులు భావిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే ఈ కాల‌నీలో ఏ పండ‌గ ప‌బ్బం వ‌చ్చినా చిత్ర‌పురి క‌మిటీ నానా హ‌డావుడి చేసేస్తోంది. మొన్న వినాయ‌క చ‌వితికి భారీగా మండ‌పాలు నిర్మించి పూజ‌లు, పున‌స్కారాలు చేయించింది. భారీగా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు చేయించారు. ప్ర‌స్తుతం ద‌స‌రా సంద‌ర్భంగా భారీగా ఉత్స‌వాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. దుర్గ‌మ్మ పూజ పేరుతో ఏకంగా రూ.20ల‌క్ష‌ల మేర ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే కొమ‌రం చాలా పెద్ద రేంజులోనే స్కెచ్ వేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ప్రొడ‌క్ష‌న్ బోయ్ స్థాయి నుంచి చిత్ర‌పురి అధ్య‌క్షుడి వ‌ర‌కూ ఎదిగేసిన కొమ‌రం, ఆ ఒక్క మెట్టు ఎక్క‌డం ఏమంత క‌ష్టం? అన్న ముచ్చ‌టా సాగుతోంది. అయితే కాల‌నీలో అవినీతి విష‌య‌మై ప‌లు వివాదాలు అత‌డికి కొంత మైన‌స్ కానున్నాయ‌ని తెలుస్తోంది.