ఇన్నేళ్లకు పండుగాడు రికార్డును బద్దలుకొట్టిన చిట్టిబాబు!

Wednesday, June 27th, 2018, 01:45:26 AM IST


ప్రిన్స్ మహేష్ బాబును సూపర్ స్టార్ మహేష్ గా మార్చిన చిత్రం ఏదంటే ఎవరైనా ఠక్కున చెప్పే మాట ఒక్కటే, అదే పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్, వైష్ణో అకాడమీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2006 ఏప్రిల్ లో వేసవి కానుకగా విడుదలయి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కేవలం ప్రేక్షకుల రివార్డులతోనే కాక, అప్పట్లో అవార్డులపరంగా సంచలనం నమోదుచేసింది పోకిరి. అంతేకాదండోయి తెలుగులో పెద్ద ఘనవిజయం తరువాత పలు భాషల్లోకి అనువాదమై ఈ చిత్రం అలా అనువదించబడ్డ అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ కావడం మరొక అద్భుత విషయంగా చెప్పవచ్చు.

అయితే ఆ చిత్ర రికార్డుల్లో కొన్ని ఇప్పటికీ కూడా ఏ చిత్రం కూడా బద్దలు కొట్టలేకపోయిందనే చెప్పాలి. మహేష్ సరసన ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రం అప్పట్లో హైదరాబాద్ మహా నగరంలో సింగల్ థియేటర్ రికార్డుగా రూ.1,61,43,081 కలెక్షన్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పటివరకు ఏ చిత్రం కూడా ఆ కెలెక్షన్ ను దాటలేకపోయింది. మొత్తానికి ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం ఆ రికార్డును బీట్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం అదే సుదర్శన్ థియేటర్ లో 89రోజులకు గాను రూ.1.62 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఇవాళ ట్రేడ్ పండితులు ప్రకటించారు. విడుదలయిన ప్రతిచోటా మంచి కలెక్షన్లతో దూసుకెళ్లిన రంగస్థలం, ప్రస్తుతం పోకిరి కలెక్షన్లను దాటేయడంతో ఈ చిత్రం తనఖాతాలో మరొక అద్భుత రికార్డును సొంతం చేసుకుందని చెప్పవచ్చు…..