ఐపీఎల్ బౌలర్లకు చుక్కలు కనబడాలి : గేల్

Saturday, April 7th, 2018, 03:47:25 PM IST

వెస్ట్ ఇండీస్ ఆటగాడు క్రిస్ గేల్ అంటే ఒకప్పుడు బౌలర్లకు భయం. అతన్ని అవుట్ చేయాలంటే అంత సులువు అయ్యేది కాదు. ఎంతటి ఫాస్ట్ బౌలర్ అయినా కూడా గేల్ ముందు తోక ముడవాల్సిందే. ఎన్నో సిక్సులు కొట్టి ఐపీఎల్ చరిత్రలో హీరోగా నిలిచినా గేల్ గత కొంత కాలంగా ఫామ్ లేక సతమతమవుతున్నాడు. గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ కి ఆడిన గేల్ ఈ సారి మాత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున ఆడుతున్నాడు. 11వ సీజన్ వేలంలో మొదట గేల్ ను ఎవరు తీసుకోలేదు. అయితే అమ్ముడుపోని ఆటగాళ్లను మొత్తం ఒకసారి వేలం వేయగా పంజాబ్ అతన్ని రెండు కోట్లకు దక్కించుకుంది. ఇక ఈ సారి ఆ జట్టు కొంచెం బలంగా మారింది. అయితే గేల్ కూడా ఈ సారి తాను తప్పకుండా ఫామ్ లోకి వస్తానని చెబుతున్నాడు. అంతే కాకుండా ఐపీఎల్ బౌలర్లకు చుక్కలు చూపిస్తా అనే రేంజ్ లో హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కేవలం తాను ఒక్కడినే కాకుండా జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని అందరు తప్పకుండా ఐపీఎల్ లో చక్కటి ఆటను కనబరుస్తారని చెప్పాడు.