900 ఏళ్లనాడు అలా జరిగిందా…?

Monday, April 16th, 2018, 01:13:32 PM IST

ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా పేరు తెచ్చుకున్న సింధునాగరికత అంతరించడానికి గల కారణాన్ని తాజాగా ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు చివరికి కనుగొన్నారు. 900 ఏళ్లపాటు కొనసాగిన కరువు కారణంగానే 4,350 ఏళ్లక్రితం సింధు నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని వెల్లడించారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల కరువు వచ్చిందని.. కొన్నేళ్ల తర్వాత ఆ కరువు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు అక్కడి నుంచి మైదానాలకు వలస వెళ్లారని భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా వివరించారు. ప్రజలంతా గంగా యమునా లోయ గుండా ప్రయాణిస్తూ ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, తూర్పు బెంగాల్‌, దక్షిణ వింధ్యాచల్‌, దక్షిణ గుజరాత్‌కు చేరుకున్నారన్నారు. ఇందుకు గల ఆధారాలు కూడా పక్కాగా ఉన్నాయని తెలిపారు.

జియోలజీ, జియోఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కొందరు పరిశోధకులు.. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఈ కారణం వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని క్రమంగా అది కరువుకు దారితీసి ఇక్కడి వారంతా వలసలు వెళ్ళిపోవటానికి కారణమయిందని తెలిపారు. ఈ పరిస్థితి 9 వందల ఏళ్ల పాటు కొనసాగడం వల్ల అప్పటివరకు సిరిసంపదలతో వర్థిల్లిన సింధు నాగరికత వైభవం అట్టడుగులోకి మునిగిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. వారి పరిశోధనకు ఆధారాలుగా లడఖ్‌లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను ఐఐటీ బృందం జతచేసింది.

  •  
  •  
  •  
  •  

Comments