సానియాకు మరో ‘కోటి’ నజరానా

Thursday, September 11th, 2014, 01:52:16 PM IST


తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి, ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు మరో కోటి రూపాయల నజరానాను ప్రకటించింది. ఇటీవల యూఎస్ ఓపెన్ టెన్నీస్ టోర్నమెంట్ మిక్స్ డ్ టైటిల్ గెలుచుకున్నందుకు గాను సానియాకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఈ పారితోషకాన్ని బహుమతిగా ప్రకటించింది.కాగా ఈ టోర్నీలో పాల్గొనేందుకు శిక్షణ కొరకై సానియాకు గతంలో ఒకసారి తెలంగాణ సర్కారు కోటి రూపాయలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక టైటిల్ గెలుచుకుని హైదరాబాద్ చేరుకున్న సానియా విలేకరులతో మాట్లాడుతూ ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన తర్వాత ఆడిన తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీలోనే టైటిల్ సాధించాను. ముఖ్యమంత్రి కెసిఆర్ నన్ను ఎంతో ప్రోత్సహించారు. రాష్ట్రప్రభుత్వం అందించిన చేయూత శిక్షణ పొందడానికి ఎంతగానో ఉపయోగపడింది. వివాదాల సమయంలో కూడా ప్రభుత్వం నాకు అండగా ఉంది. ఆ కృతజ్ఞ్యతతోనే నా మనసులోని మాటను బయట పెడుతూ తెలంగాణ ప్రజలకు నా గెలుపును అంకితమిస్తున్నా’నని పేర్కొన్నారు.