తెలంగాణా గాంధీగా సీఎం కేసీఆర్..

Thursday, May 17th, 2018, 08:52:05 AM IST

బుదవారం పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జల్లాలలో రైతు బందు పథకం చెక్కులు, పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యుటీ సీఎం మహమ్మద్ అలీ, రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్, ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రైతన్నల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యుటీ సీఎం మహమ్మద్ అలీ ప్రసంగిస్తూ మన రాష్ట్ర సీఎం కేసీఆర్ తెలంగాణ ముద్దు బిడ్డ అని, ఆయన తెలంగాణ రాష్ట్రానికి మరో గాంధీ లాంటివాడని అభివర్ణించారు. 70 ఏండ్ల నుంచి రెండు పార్టీలు రాష్ట్రాన్ని పాలించినా ఏ పార్టీ కూడా తెలంగాణకు తగిన న్యాయం చేయలేదని, నమ్మినందుకు నిట్ట నిలువునా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన 4 ఏండ్లలోనే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిందని, ఆయన చేసే అభివృద్ధి ఇప్పుడు ఎవ్వరి కంటికి కనిపించకపోయినా, ఆలోచనలకు అందకపోయినా కూడా, భవిష్యత్తులో ఆయన చేసిన పనుల వల్ల ప్రజలకు చాలా మంచి జరగనుందని అది అందరూ గుర్తించాలన్నారు.

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కేంద్రం నుండి సరైన సహాయం అందకపోయినా కూడా అన్ని కష్టాలకు ఎదురీదుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా ఈ రోజు మన సీఎం కేసీఆర్ నిలిచారన్నారు. ఆ భగవంతుడు కేసీఆర్ రూపంలో రాష్ట్రానికి ఒక గొప్ప ప్రజా నాయకుణ్ణి ఇచ్చారని ఆయన అభివర్ణించారు. డబ్బున్న జమిందారులకు రైతులు భయపడేది లేదని, దానికోసమే భూప్రక్షాలన చేసి కొత్త పట్టాదార్ పాస్ బుక్కుల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఎక్కడైనా నకిలీ పాస్ బుక్కులు సృష్టించి రైతులను మోసం చేసినట్టు కనిపిస్తే పీడీ యాక్ట్ కేసులు మోపి నిందితులను అరెస్టు చేయాలని పోలీసు బలగాలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 24 గంటల విద్యుత్తు సహాయం అందిస్తుంటే అటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ వర్గాలకు ఏం మాట్లాడలేక నోర్లు మూత పడ్డాయని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు సీఎం గా దొరకడం నిజంగా మన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.