త్వరలోనే పోలీసులకు సకల సదుపాయాలతో క్వార్టర్స్…

Tuesday, April 10th, 2018, 08:26:50 AM IST

పోలీసులకు త్వరలో సకల సదుపాయలతో అపార్ట్‌మెంట్ల తరహాలో క్వార్టర్స్ అందుబాటులోకి తేనున్నట్టు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో దామోదర్‌గుప్తా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పోలీసు క్వార్టర్స్ శిథిలావవస్థకు చేరడం, గదులు ఇరుకుగా ఉండటాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారన్నారు. అపార్ట్‌మెంట్ తరహాలో 1200-1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్‌బెడ్‌రూంలు నిర్మించాలని యోచిస్తున్నారన్నారు. అవసరమైతే హడ్కో నిధులు తీసుకుంటామన్నారు.

గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.236.82 కోట్లతో వివిధజిల్లాల్లో 103 పోలీస్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టామని, 35 భవనాల పనులు పూర్తికాగా, 68 చోట్ల కొనసాగుతున్నాయన్నారు. రూ.375 కోట్లతో రెండు కమిషనరేట్ భవనాలు,13 జిల్లా పోలీసు అధికారుల భవన నిర్మాణ పనులు కొసాగుతున్నాయ న్నారు. రూ.81.52 కోట్లతో 289 పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం చేపట్టామని, వీటిలో 126 పూర్తికాగా, 163 చోట్ల కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది రూ.464.46 కోట్లతో నిర్మాణాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఎండీ మల్లారెడ్డి, చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణ, ఎస్ఈ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానం లో ఉన్నదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పోలీస్ భవన నిర్మాణ పనులను ప్రశంసిస్తూ చైర్మన్ దామోదర్, ఎండీ మల్లారెడ్డి, ఇంజినీర్లు, సిబ్బందిని ఆయన అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ కూడా ప్రశంసించారని, ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

  •  
  •  
  •  
  •  

Comments