ఎన్టీఆర్ కథానాయకుడు: మహానటితో పోలిస్తే..?

Thursday, January 10th, 2019, 05:15:17 PM IST

టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ ఊపందుకుంది, మహానటి ఎప్పుడైతే విడుదలైందో ఆ మరు క్షణం నుండి వరుస పెట్టి బయోపిక్ లు అనౌన్స్ అయ్యాయి, వాటిల్లో పూర్తైనవి కొన్నైతే, ఇంకా ప్రారంభం కావాల్సినవి కొన్ని. అలంటి వాటిల్లో ఒకటైన నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడిల కాంబినేషన్ లో వచ్చిన “ఎన్టీఆర్ కథానాయకుడు” నిన్న విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీప్రస్థానం మొదలైన దగ్గర నుండి ఆయన మహానటుడిలా ఎలా ఎదిగాడు, తర్వాత ఆయన రాజకీయాలవైపు మళ్ళటానికి ఏ పరిస్థితులు కారణం అయ్యాయి వంటి ఎన్టీఆర్ జీవితంలోని విశేషాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు క్రిష్. అయితే కథానాయకుడులో ఎన్టీఆర్ సినీరంగ విశేశాలను చూపించటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు క్రిష్, ఆయన పూర్తి జీవితాన్ని ఒక భాగంగా తెరకెక్కించటం వీలు పడదని భావించిన క్రిష్ రాజకీయ జీవితాన్ని మహానాయకుడు పేరిట రెండవ భాగంగా విడుదల చేయటానికి ప్లాన్ చేసాడు.

కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణను చూస్తోంటే మళ్లీ అన్న గారినే తెరపై చూస్తున్నట్లుంది అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, నార్మల్ ఆడియెన్స్ వర్షన్ మాత్రం వేరేలా ఉంది. కృష్ణుడి గెటప్, వయసైనా ఎన్టీఆర్ పాత్ర వరకు బాలకృష్ణ ఎన్టీఆర్ లా సరిగ్గా సెట్ అయ్యాడని, యంగ్ ఎన్టీఆర్ రోల్ విషయానికి వచ్చే సరికి చాలా చోట్ల బాలయ్యను చూడటం ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు, యంగ్ ఎన్టీఆర్ రోల్ కి జూనియర్ ఎన్టీఆర్ అయ్యుంటే కథ ఇంకో రేంజ్ లో ఉండేదని అంటున్నారు. అంతే కాకుండా “మహానటితో” పోలిస్తే “ఎన్టీఆర్” ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ అవధాని అంటున్నారు. మహానటి విషయానికొస్తే దర్శకుడు నాగ్ అశ్విన్, ఆ సినిమాను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి తీసాడు, సావిత్రి జీవితం తాలూకు విశేషాల గురించి రీసెర్చ్ చేసి మరి స్క్రిప్ట్ రాసుకున్నాడు. అందులోను మహానటిలో సావిత్రి చిన్నతనంలోని తుంటరి తనం, గడుసుతనం తాలూకు హాస్యం, పెద్దయ్యాక జెమినీ గణేశన్ తో ప్రేమలోని రొమాన్స్, ఆ తర్వాత వైవాహిక జీవితంలోని ఒడిదుడుకుల తాలూకు ఎమోషన్స్, ఆమె వ్యసనాల తాలూకు ట్రాజెడీ, ఇవన్నీ ప్రేక్షకుడికి ఎంతగానో కదిలించాయి, సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడు భావోద్వేగానికి లోనై బయటికి రావటంలో ఆ ఎమోషనల్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషించాయి. అందుకే మహానటి అంత హిట్ అయ్యింది. ఎన్టీఆర్ కధానాయకుడులో ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ చనిపోయినపుడు తప్ప మిగతా సీన్లలో అలాంటి బలమైన ఎమోషన్ మిస్ అయ్యిందని అంటున్నారు. ఎన్టీఆర్ సినీ జీవితంలో కూడా ఒడిదుడుకులేవీ లేకపోవటంతో సినిమా అక్కడక్కడా సాగదీసినట్లు ఉంది, స్క్రీన్ ప్లేలో కూడా గ్రిప్ మిస్ అయ్యిందని అంటున్నారు. మొత్తం మీద బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో జీవించినప్పటికీ కథలో బలమైన ఎమోషనల్ కంటెంట్ లేకపోవటం వల్ల మహానటితో పోలిస్తే ప్రేక్షకుడ్ని అలరించటంలో వెనకబడిందనే చెప్పాలి.