కేటీఆర్, చంద్రబాబు పోటా పోటీ !

Sunday, January 21st, 2018, 12:15:50 AM IST

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో రెండు రాష్ట్రాల అధికార పార్టీలకు చందిన చంద్రబాబు, కేటీఆర్ పోటాపోటీగా పెట్టుబడుల కోసం తమ నైపుణ్యం ప్రదర్శించనున్నారు. దావోస్ లో ఈ నెల 23 నుండి 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వర్షిక సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రముకుఖులే కాక మరికొంత మంది ప్రముఖులు కూడా తమ సత్తా చాటేందుకు దావోస్ చేరడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రపంచదేశాల నుండి సుమారు 3 వేల మంది ఈ సదస్సుకు హాజరు కానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ సదస్సుకు విచ్చేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా తమ విధానాలను చాటి చెప్పి పెట్టుబడులు సాధించడమే ద్యేయంగా ఇరు రాష్ట్రాల ప్రముఖులు అయిన ఆంధ్రప్రదేశ్ తరపున చంద్రబాబు, తెలంగాణ తరపున కేటీఆర్ ఇక్కడకు హాజరవుతున్నారు. ముందుగా జపాన్ పర్యటన ముగించుకుని అక్కడనుండి నేరుగా దావోస్ బయలుదేరిన కేటీఆర్, ఈ ఎకనామిక్ సదస్సులో పాల్గొనేముందు అక్కడ జపాన్ కు చెందిన జెట్రో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరైన ఈ సభలో కేసీఆర్ తెలంగాణాలో పెట్టుబడులు అంశం పై మాట్లాడారు. టోక్యో తో పాటు ఓసాకో లో కీలక సెమినార్లు ఏర్పాటుచేసినందుకు కేటీఆర్ జెట్రో సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే వ్యర్ధాలను నియంత్రించాలని, భారతీయ నగరాలకు ఇది ముఖ్యమైన ప్రక్రియ అని, స్మార్ట్ నగరాలకు ఈ ప్రక్రియను తప్పనిసరి చేయాలని ఒక ట్వీట్ ద్వారా తన భావన తెల్పిన కేటీఆర్ , అందుకే దీనిలో భాగం గా టోక్యో లోని క్లీన్ అథారిటీ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. కాగా ఈ సాయంత్రం తమ బృందంతో చంద్రబాబు దావోస్ కు బయల్దేరి వెళ్తున్నారు. ఆయన ఈనెల 24 వరకు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం అదేరోజు రాష్ట్రానికి తిరుగు పయనమవనున్నారు. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు, కేటీఆర్ ఇద్దరిలో ఎవరు తమ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు సాధించి కంపెనీలను తెస్తారనే అంశంపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది…