ఎన్నికలకు ముందే మహాకూటమిలో వివాదాలు..!

Thursday, November 8th, 2018, 10:47:26 AM IST

తెలంగాణ ఎన్నికల్లో తెరాస ను గద్దె దింపడమే లక్ష్యంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి మహాకూటమి గా ఏర్పడ్డ సంగతి తెలిసిందే, కాంగ్రెస్ 119స్థానాలకు గాను 95 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. మిగిలిన 24స్థానాల్లో మిగతా పార్టీల్లో ఎవరికెన్ని స్థానాలు కేటాయించాలన్న దానిపై వివాదం నెలకొంది. 14 స్థానాలను టీడీపీకి, మిగతా 10 స్థానాలను సిపిఐ, టీజెఎస్ లకు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే టీజెఎస్ మాత్రం తమకు 11స్థానాలు కేటాయించాలని కోరుతుంది.

సిపిఐ తమకు 4,5 అసెంబ్లీ స్థానాలు కావాలని పట్టు పట్టింది. వాళ్లు అనుకున్న సీట్లు కేటాయించటానికి కాంగ్రెస్ సుముఖంగా లేదని తెలుస్తుంది. దీంతో టీజెఎస్ అధినేత కోదండరాం కాంగ్రెస్ వైఖరి పై కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. సిపిఐ కూడా సీట్ల విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల గడువే ఉన్నప్పటికీ మహాకూటమిలో సీట్ల పంపకం విషయంలో వివాదం ఇంకా కొలిక్కి రాకపోవటంతో మహాకూటమి భవితవ్యం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరాస పార్టీ సైలెంట్ గా తన ప్రచారం చేసుకుంటూ ఎన్నికల రేసులో ముందంజలో దూసుకుపోతుంది.