కర్ణాటకలో కాంగ్రెస్ ముందస్తు వ్యూహం ఫలించింది!

Monday, May 21st, 2018, 10:44:00 AM IST


కర్ణాటకలో ఎట్టకేలకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు సమయం ఆసన్నమయింది. నిజానికి అనేక నాటకీయ పరిణామాల తర్వాతగాని వారికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కలేదని చెప్పాలి. ఫలితాలలో బిజెపికి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినంత మంది అభ్యర్థులు లేకపోవడం ఒకింత కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినట్లయింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల ముందు నుండే తమ వ్యూహాలను రచించినట్లు తెలుస్తోంది. నేషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో గులాం నబి ఆజాద్, అశోక్ గహ్లోత్, కెసి వేణుగోపాల్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్నికల శైలి తదనంతర పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే ఎన్నికలు పూర్తి అయ్యాయో అప్పటినుండి వారు మరింత వ్యూహరచనతో ముందుకు సాగినట్లు తెలుస్తోంది. తొలుత కౌంటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీల అభ్యర్థులు సమన ఓట్లతో నడుస్తున్నప్పటికీ, కాసేపటికి బిజెపి దూకుడు ఒకింత ఎక్కువ కొనసాగింది.

దీనినిబట్టి దాదాపుగా అక్కడ హంగ్ ఖాయమని కొందరు రాజకీయ విశ్లేషకులు తేల్చడంతో అప్రమత్తమయిన కాంగ్రెస్ నేతలు ఫలితాలు మూడొంతులు బయటకు వచ్చే సమయానికి ఎలాగైనా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవ్వలని, ఆ సమయంలో కింగ్ మేకర్ గా వున్న జేడీఎస్ కు తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ వెనువెంటనే తాము జేడీఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఒక సంచలన ప్రకటన విడుదల చేసారు. అయితే బిజెపి నాయకులు కూడా తమ ప్రయత్నాల్లో తాము ఉన్నారు. మరోవైపు అమిత్ షా, యెడ్యూరప్ప సహా ప్రభుత్వ ఏర్పాటుకు కావలిసిన మిగతా ఎమ్యెల్యే ల కొనుగోలుపై పలువురు అభ్యర్థులతో బేరసారాలు ఆడినట్లు, కాంగ్రెస్ నాయకులూ యెడ్యూరప్ప సహా కొందరు జరిపిన సంభాషణల టేప్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తొలుత జేడీఎస్, కాంగ్రెస్ లు ప్రభుత్వ ఏర్పాటుకోసం గవర్నర్ వద్దకు వెళ్లగా వారి ఆహ్వానాన్ని తోసిపుచ్చిన గవర్నర్ బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం జరిగింది.

వెనువెంటనే యడ్యూరప్పను సీఎం గా ప్రాణాస్వీకారం చేయించడం, ఆయనకు బలనిరూపణకు 15 రోజులు గడువు ఇవ్వడం జరిగిపోయింది. అయితే ఈ మొత్తం చర్యను ముందుగానే ఊహించిన కాంగ్రెస్ నేతలు సుప్రీమ్ కోర్ట్ లో వ్యాజ్యం వేయడం, తద్వారా సుప్రీమ్ కోర్ట్ యెడ్యూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వానికి బలనిరూపణకు రెండురోజులు సమయం ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికే జేడీఎస్ ఎమ్యెల్యేలపై ఈడీ, సీబీఐ తదితర సంస్థల పేరుతో బెదిరింపులకు గురిచేసి తమకు మద్దతు ప్రకటించాలని బిజెపి ప్రయత్నాలు చేసిందని కుమార స్వామి బహిరంగం గానే చెప్పారు, అంతే కాదు కొందరికి రూ.100 కోట్లు మరియు మంత్రి పదవులు ఆశ చూపారని అన్నారు. ఇక చివరికి అసెంబ్లీలో బలరూపణ సమయం ఆసన్నమవడంతో యెడ్యూరప్ప చివరకు కేవలం నాలుగు రోజుల ముఖ్యమంత్రిగా మిగిలి రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే ఇదంతా కాంగ్రెస్ నేతలు ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లడం వల్లనే జరిగిందని, బిజెపి కుటిల రాజకీయాలు కర్ణాటకలో పనిచేయలేదని పలువురు కాంగ్రెస్ నేతలు అబిప్రాయపడుతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments