జేడీఎస్ కు కాంగ్రెస్ మద్దతు……ముఖ్యమంత్రిగా కుమారస్వామి?

Tuesday, May 15th, 2018, 04:17:49 PM IST

కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారం, ఓటింగ్ దగ్గరినుండి నేడు ఫలితాల వరకు ప్రతిదీ కూడా ఎంతో ఉత్కంఠతో సాగుతోంది. ఇప్పటికే అత్యధిక స్థానాల్లో గెలుపు దిశగా బిజెపి దూసుకుపోతుండగా, మరోవైపు కాంగ్రెస్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. మొదటి నుండి కొన్ని సర్వేలు చెపుతున్నట్లుగా అక్కడి ప్రజలు వాస్తవానికి ఏపార్టీకి పూర్తిగా మద్దతు ఇవ్వలేదు. హంగ్ దిశగా ఫలితాలు సాగుతున్నాయి. జేడీఎస్ అయితే కింగ్ స్థానంలో లేదా కింగ్ మేకర్ స్థానంలో నిలుస్తుందని కూడా కొన్ని సర్వే లు చెప్పాయి. అయితే ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే బిజెపి 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 2 స్థానాలు దక్కించుకున్నారు .ఈ సమయంలో యుపిఎ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక కీలక నిర్ణయం తీసుకుని సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో తమ పార్టీ జేడీఎస్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటన చేశారు.

బిజెపికి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ ని ఆ పార్టీ అందుకోలేకపోవడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ నాయకులు తమ మద్దతును జేడీఎస్ కు ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే జేడీఎస్ కూడా ఈ మేరకు కొన్ని డిమాండ్లను కాంగ్రెస్ ముందు ఉంచిందని, సీఎం అభ్యర్థిగా కుమారస్వామి ని ప్రకటించాలని, అలానే పలు మంత్రి పదవులు కోరినట్లు, ఈ విషయమై ఇరుపార్టీల నేతలు ఫోన్లో సమాలోచనలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. కాగా నేటి సాయంత్రం ఇరు పార్టీల నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదేకనుక జరిగితే మ్యాజిక్ ఫిగర్ కు కేవలం అతికొద్ది దూరంలో నిలిచిన బిజెపి ఆశలు గల్లంతయి ప్రతిపక్షంలో కూర్చోవలసిందే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు……..

  •  
  •  
  •  
  •  

Comments