మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి జగన్ బాధ్యత అప్పగించిన కాంగ్రెస్

Saturday, May 18th, 2019, 01:07:40 AM IST

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాడానికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తూ అందుకు అనుగుణంగా పావులను కదుపుతుంది కాంగ్రెస్ అధిస్థానం… కేంద్రంలో బీజేపీ ని కాదని అధికారాన్ని దక్కించుకుందామని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కాగా ఎన్నికల ఫలితాల తరువాత యూపీఏ కి మద్దతు ఇచ్చే ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం చేసే ప్రత్నాలను ముమ్మరం చేసింది. అయితే ఎన్నికల ఫలితాల రోజు వీరు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చంద్రబాబు కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇప్పుడు కెసిఆర్ కూడా తమకే మద్దతు ఇస్తున్నాడన్న సమాచారంతో కాంగ్రెస్ పార్టీకి కాస్త తల భారం తగ్గినట్లయిందని సమాచారం. కానీ ఇప్పుడు జగన్ అవసరం కూడా కాంగ్రెస్ కి ఉండటంతో జగన్ ని ఎలాగైనా తమకే మద్దతు ఇచ్చేలా మలుచుకోడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది.

అయితే ఈ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నేతకు అప్పగించినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత యూపీఏకి మద్దతుగా జగన్ ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌‌ ను రంగం లోకి దించినట్లు సమాచారం. కమల్ నాథ్ కాంగ్రెస్ పార్టీ లో చాలా కీలకమైన వ్యక్తి. అంతేకాకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కమల్ నాథ్ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఈ సందర్భంగా జగన్ తో చర్చలకు ఇప్పటికే కొన్ని అడుగులు కూడా వేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి అంగీకరిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.