చింతమనేనికి కాంగ్రెస్ మహిళా అధ్యక్షరాలు సవాల్!

Wednesday, April 18th, 2018, 07:12:51 PM IST

ఎప్పటికపుడు తన మాట తీరుతో తరచూ చిన్న చిన్న వివాదాల్లో ఇరుక్కునే ఏపీ అధికారపక్ష నేత టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అయితే నేడు ఆయనకు దిమ్మ తిరిగే సవాల్ ఒకటి ఎదురైంది. ఇటీవల ఆర్టీసీ బస్సుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోస్టర్ కాస్త చినిగి ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేయటం, బండ బూతులు తిట్టిన వైనం సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఊహించని రీతిలో ఆయనకు సవాల్ విసిరారు. ఒక ఆర్టీసీ బస్సుపై ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు పోస్టర్ ను చించేసిన ఆమె, దమ్ముంటే తనపై దాడి చేయాలని సవాల్ విసిరారు.

ఉదయం 11 గంటలకు తాను హనుమాన్ జంక్షన్ వద్దకు వస్తానని దమ్ముంటే తనపై దాడి చేయాలని ఛాలెంజ్ చేశారు. అయితే, ఆమె సవాల్ పై స్పందించని చింతమనేనిపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. సవాల్ విసిరినా పిరికిపందలా చింతమనేని రాలేదన్నారు. అధికారమదంతో చింతమనేని దాడులకు తెగబడుతున్నారన్నారు. దాడి చేసిన చింతమనేనిని వదిలేసిన పోలీసులు సామాన్యుల మీద కేసులు నమోదు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందంటూ సుంకర పద్మశ్రీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఇటువంటి నేతలు తమ ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, ఇకనైనా చంద్రబాబు తమ నేతలను, కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని, ముఖ్యంగా ప్రజాక్షేమంపై దృష్టిపెడితే మంచిదని హితవు పలికారు…..

  •  
  •  
  •  
  •  

Comments