కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి తెరాస‌కు ఝ‌ల‌క్‌?

Wednesday, November 21st, 2018, 12:14:02 PM IST

మ‌హేశ్వ‌రం నుంచి తెరాస‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చెప్పిన‌ట్టుగానే తెరాస‌కు మంగ‌ళ‌వారం రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌న త‌రువాత పార్టీలో చేరిన ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి ఆధిప‌త్యాన్ని గ‌త కొంత కాలంగా స‌హించ‌లేకే విసిగిపోయిన కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి తెరాస‌ను వీడినట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల త‌న‌పై వ‌చ్చిన వార్త‌ల్ని ఖండిస్తూ కేసీఆర్‌కు వివ‌ర‌ణ ఇచ్చిన కొండా విశ్వేశ్వ‌రరెడ్డి వారం తిర‌గ‌కుండానే తెరాస‌కు రాజీనామా చేయ‌డం వెనుక పెద్ద మంత్రాంగ‌మే న‌డిచింద‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎన్నిక‌ల వేళ తెరాస శ్రేణుల్ని మాన‌సికంగా దెబ్బ‌కొట్టాల‌న్న కాంగ్రెస్ ఎత్తుగ‌డ‌లో భాగంగానే విశ్వేశ్వ‌ర‌రెడ్డి తెరాస‌కు షాకిచ్చార‌నే వాద‌న వినిపిస్తోంది.

ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి పార్టీలో చేరిన ద‌గ్గ‌రి నుంచి సౌమ్యుడైన కొండా విశ్వేర్వ‌ర‌రెడ్డికి ప్రాధాన్య‌త త‌గ్గింద‌ని, దాన్ని అవ‌మానంగా భావించి మ‌న‌స్థాపానికి గురైన కొండా పార్టీని వీడాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఇదిలా వుంటే రేవంత్ రెడ్డి చెప్పిన రెండ‌వ వికెట్ ఎంపీ సీతారామ్ నాయ‌క్ కూడా డిసెంబ‌ర్‌లో పోలింగ్‌కు వారం ముందు తెరాస‌కు ఝ‌ల‌క్ ఇచ్చే అవ‌కాశం వుంద‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అదే నిజ‌మైతే తెరాస‌పై రేవంత్ మైండ్ గేమ్‌లో విజ‌యం సాధించిన‌ట్ల‌వుతుందా? అంటే ఎలాంటి ప్రాధాన్య‌త లేని ఎంపీలు పార్టీ వీడినంత మాత్రాన జ‌రిగే న‌ష్ట‌మేమీ తెరాస‌కు ఉండ‌బోద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. నిజ‌మే కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, సీతారామ్ నాయ‌క్ మాస్ లీడ‌ర్‌లు కాదు. తేరాస‌పైనా, కేసీఆర్ పైనా ఇది రేవంత్ విజ‌యం అనే చెప్పాలి. ముందే వార్నింగ్ ఇచ్చి మ‌రీ సాధిస్తున్నాడు కొడంగ‌ళ్ బిడ్డ‌డు!!