భరోసా అంటూ భగ్గుమంటున్నారు..!

Friday, October 17th, 2014, 10:00:14 PM IST

congress
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘భరోసా’ యాత్రలంటూ సీఎం కేసీఆర్ పై భగ్గుమంటున్నారు. ముఖ్యంగా రైతులకు భరోసా కల్పించేందుకే అని చెబుతున్న ఈ యాత్రల్ని టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా సాగే కార్యక్రమంలా మార్చుతున్నా టీ-కాంగ్రెస్ నేతలు. రైతులకు న్యాయం చేయకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో నిద్రపోతానని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కరీంనగర్ లో రైతు భరోసా యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాల్లోనే విద్యుత్ బకాయిలు, రుణమాఫీపై సంతకం చేసి అమలు చేశారని అన్నారు.

సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ మేలు చేయరని కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మండిపడ్డారు. కేసీఆర్ పచ్చి మోసకారి అని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేవరకు రైతుల సమస్యలపై తాము ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గోదావరి దాటి నాలుగడుగులు వేస్తే ఛత్తీస్ గఢ్ నుంచి కరెంటు వస్తుందని చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. కరెంటు సమస్యలపై కేసీఆర్ ను అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.