కాంగ్రెస్సా మ‌జాకానా.. గ‌ద్ద‌ర్‌కు బిగ్‌షాక్‌

Tuesday, November 20th, 2018, 10:50:33 AM IST

ద‌శాబ్దాల కాలంగా పీపుల్స్ వార్ ఉద్య‌మానికి త‌న గ‌ళంతో వెన్నుద‌న్నుగా నిలిచిన అజేయ‌మైన‌ శ‌క్తి.. గ‌ద్ద‌ర్‌. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జా యుద్ధ‌నౌక‌గా పేరుగాంచిన ఆయ‌న గ‌త కొన్నేళ్లుగా ఓటు మాటే ఎత్త‌లేదు స‌రిక‌దా ఓట‌రు కార్డుని కూడా పొంద‌లేదు. అలాంటి వ్య‌క్తి ఈ ఎన్నిక‌ల వేళ ద‌శాబ్దాల ఉద్య‌మ ప్ర‌స్థానాన్ని ప‌క్క‌న పెట్టి తొలిసారి క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ పెద్ద‌ల‌ను క‌లిసి త‌న మ‌ద్ద‌తు తెలిపిన‌ గ‌ద్ద‌ర్ కాంగ్రెస్ త‌రుపున టికెట్‌ను మాత్రం పొంద‌లేక‌పోయాడు.

కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌కు అండ‌గా వుంటాన‌ని మాటిచ్చిన త‌న‌కే ఇప్పుడు కాంగ్రెస్ హ్యండివ్వ‌డం గ‌ద్ద‌ర్‌ను గంద‌ర‌గోళానికి గురిచేస్తోంద‌ట‌. ఇక త‌న కొడుకు సూర్యంకు బెల్లంప‌ల్లి నుంచి టికెట్ ఇప్పించాల‌ని గ‌ద్ద‌ర్ చేసిన ప్ర‌య‌త్నం కూడా విఫ‌లం అయింది. త‌ను కోరిన బెల్లంప‌ల్లి టికెట్‌ను కాంగ్రెస్ కూట‌మి స‌ర్దుబాటుల్లో భాగంగా సీపీఐకి కేటాయించింది. దీంతో గ‌జ్వేల్ నుంచి త‌న‌ని పోటీకి దిగ‌నివ్వ‌క‌, క‌నీసం త‌మ పార్టీ త‌రుపున స్టార్ క్యాంపెయిన‌ర్‌గా కూడా త‌న‌ని గుర్తించ‌క‌పోవ‌డం గ‌ద్ద‌ర్ అవ‌మానంగా భావిస్తున్నాడ‌ట‌.