ఏపి మీద కాంగ్రెస్ ఆసక్తి.. ఆ స్థానం అందుకుంటుందట!

Friday, June 1st, 2018, 03:00:38 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్రిముఖ పోటీ ఉంటుందని అందరు అనుకుంటున్నదే. తెలుగు దేశం పార్టీ – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రతి సారి గట్టిగా పోటీ నడుస్తోంది. అలాగే వారికి ధీటుగా 2019 ఎలక్షన్స్ లో నిలబడాలని జనసేన అధినాయకుడు పవన్ కూడా తనదైన శైలిలో జనాలను ఆకర్షిస్తున్నాడు. ఇక గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విభజన తరువాత ఏ స్థాయికి దిగజారిపోయిందో అందరికి తెలిసిందే. ఎన్ని సార్లు కోలుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మిగతా పార్టీలకు పోటీని ఇవ్వలేకపోతున్నాయి. గతంలో నంద్యాల ఎలక్షన్స్ లలో అలాగే ఇతర మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగినా కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు చేదు అనుభవమే ఎదురైంది.

ఎన్ని ఎన్నికలు వచ్చినా పోటీ నుంచి తప్పుకోవద్దని అధిష్టానం నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఆ పార్టీలో సీనియర్ నాయకుడు ఏపీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. వచ్చే 2019 ఎలక్షన్స్ లో ఎన్నో కొన్ని సీట్లు రాబట్టాలని ప్రతిపక్ష స్థానానికైనా పార్టీని తీసుకురావాలని అక్కడి కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. త్వరలోనే భారీ సభలను నిర్వహించి ప్రతి గ్రామంలో క్యాడర్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. ముందుగా గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలను సెట్ చేసుకోవాలని పార్టీ సీనియర్ నాయకులూ ఆలోచిస్తున్నారు. ఎలాగైనా పుంజుకొని ఏపీ లో మళ్లీ అధికారాన్ని అందుకోవాలని కాంగ్రెస్ ఆశపడుతోంది. మరి కాంగ్రెస్ వచ్చే ఎలక్షన్స్ లో ఎంతవరకు పోటీని ఇస్తుందో చూడాలి.