కోదండ ఆట‌లో అరిటిపండేనా?

Friday, November 2nd, 2018, 12:11:58 PM IST

తేజస అధినేత, ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌ను కాంగ్రెస్ ఆడుకుంటోందా? తాజా ప‌రిస్థితులు చూస్తే అవున‌నే అనిపించ‌క‌మాన‌దు. కాంగ్రెస్ మాయ‌మాట‌లు న‌మ్మిన తెలంగాణ జ‌న స‌మితి అధినేత కోదండ‌రామ్ కూట‌మి కుయుక్తుల‌కు బాధ్యుడిగా మార‌బోతున్నారని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడి తాజా ప్ర‌క‌ట‌న‌తో తేట‌తెల్ల‌మైపోయింది. కాంగ్రెస్ 119 స్థానాల‌కు గానూ 95 స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని, మిగ‌తా 24 స్థానాలకు గ‌నూ 14 స్థానాల్లో టీడీపీ పోటీ చేయ‌గా మిగిలిన 10 స్థానాల్ని తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐ పంచుకుంటాయ‌ని ఉత్త‌మ్ తేల్చి చెప్ప‌డం కాంగ్రెస్ నైజాన్ని తెలియ‌జేస్తోంద‌ని తెజ‌స శ్రేణులు మండిప‌డుతున్నారు.

సీట్ల స‌ర్ధుబాటు పేరుతో గ‌త కొన్ని రోజులుగా కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు తీరా స‌మ‌యం వ‌చ్చేస‌రికి త‌మ క‌ప‌ట‌బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వాపోతున్నారు. అయితే కాంగ్రెస్ చెబుతున్న 95స్థాన‌ల‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం ఈ నెల 9 నే వెలువ‌డే అవ‌కాశం వుంది. గురువారం స్క్రీనింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ భ‌క్త చ‌ర‌ణ్‌దాస్ తో పాటు కాంగ్రెస్ కీల‌క నేత‌లు స‌మావేశ‌మై తుది జాబితాను దీపావ‌ళి త‌రువాతే ప్ర‌క‌టించాల‌ని తీర్మానించారు. ఇక 8వ తేదీన మ‌రోసారి స‌మావేశ‌మై 9న తుది జాబితాను ప్ర‌క‌టిస్తార‌ట‌. ఇదంతా బాగానే వుంది కానీ.. కూట‌మి నుంచి 15 సీట్లు ఆశిస్తున్న తెలంగాణ జ‌న‌స‌మితిని ఆట‌లో అర‌టిపండుగా తేల్చేసిన‌ట్టేనా? అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత కోదండ‌రామ్ మొద‌టి నుంచి సీట్ల విష‌యంలో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వంతో విభేదిస్తూనే వున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న ఊహించిందే జ‌ర‌గ‌బోతోందా? అత్య‌ధిక సీట్లు కావాల‌ని అడిగిన ప్ర‌తిసారీ ఉత్త‌మ్ వెట‌కారంగా మాట్లాడిన తీరు కూడా జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు అద్ధం ప‌డుతోందని చెబుతున్నారు. మొద‌టి నుంచి తెజ‌స‌ను ఆట‌లో అర‌టిపండులా వాడుకుని వ‌దిలేయాల‌న్న ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఉత్త‌మ్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తూ తెజ‌స శ్రేణుల్ని అవ‌మానిస్తున్నాడ‌ని, ఇప్ప‌టికైనా తెజ‌స శ్రేణులు మేలుకుని త‌మ దారి తాము చూసుకుంటే మంచిద‌ని బాహాటంగానే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.