కాంగ్రెస్ సెల్ఫ్ గోల్? కొత్త గేమ్ ప్లాన్..

Thursday, March 14th, 2019, 09:46:06 AM IST

సీనియ‌ర్ నాయ‌కుల‌తో ఎవ‌రికి టికెట్ ఇస్తే ఎవ‌రు అస‌మ్మ‌త్తిని ర‌గిలిస్తారో అని నిత్యం భ‌య‌ప‌డే కాంగ్రెస్‌కు ఇప్పుడు ఎంపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి మాత్రం అభ్య‌ర్థులు క‌రువ‌య్యారు. గ‌తంలో ఒక్క ఎంపీ స్థానం కోసం ఇద్ద‌రు ముగ్గురు పోటీప‌డితే ఇప్పుడు ఒక్క‌రు కూడా పోటీప‌డ‌టానికి ముందుకు రాని ప‌రిస్థితి. అందుకే శాస‌నభ‌లో పోటీకి దిగిన వారిని,
గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన వారిని, గెలిచిన వారిని మ‌ళ్లీ ఈ ఎన్నిక‌ల్లోనూ బ‌రిలోకి దింపుతూ కొత్త గేమ్ ప్లాన్ అంటోంది. ఎన్న‌డూ ఎంపీ ఎన్నిక‌ల వైపు క‌నీసం తొంగి చూడ‌ని వారిని ఈ ద‌ఫా బ‌రిలోకి దింపుతూ మ‌రో త‌ప్పిదానికి శ్రీ‌కారం చుడుతోంది. కాంగ్రెస్ మ‌రో త‌ప్ప‌ట‌డుగు వేస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క ఎంపి అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు కోసం బుధ‌వారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు.

శాస‌న స‌భ ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ ద‌ఫా బ‌ల‌మైన అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింపాల‌న్న ఏఐసీసీ నిర్ణ‌యం మేర‌కు కొత్త ముఖాల‌ను బ‌రిలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందులో భాగంగా కొడంగ‌ల్‌లో ఇటీవ‌ల ఓడిపోయిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క వ‌ర్గం నుంచి ఎంపీగా బ‌రిలోకి దించాల‌ని, ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీత‌క్క‌ను మ‌హ‌బూబాబాద్‌ ఎంపీగా నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యంపై చ‌ర్చించ‌డం కోసం ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. మ‌హ‌బూబాబాద్ స్థానం నుంచి సీనియ‌ర్ నేత‌లైన బ‌ల‌రాం నాయ‌క్‌, బెల్ల‌య్య నాయ‌క్‌, చీమ‌ల వెంట‌కేశ్వ‌ర్లు, రాములు నాయ‌క్ ల పేర్ల‌ని ప‌రిశీలించిన అధిస్టానం చివ‌రి నిమిషంలో సీత‌క్క పేరుని తెర‌పైకి తీసుకురావ‌డం ప‌లువురికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఆయా స్థానాల్లో ప‌ట్టులేని నేత‌ల‌ని ఎంపీ ఎన్నిక‌ల్లో నిల‌బెట్ట‌డం అనేది కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్‌గా భావించాల్సిందే పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.